*2 ఏపీఓలు, 4 టెక్నికల్ అసిస్టెంట్లు, 4 ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్*
*గిరిజన శ్రామికులకు పనిదినాలు కల్పించడంలో వైఫల్యం*
*లక్ష్య సాధనలో అత్యల్ప ప్రగతి నమోదు చేసిన సిబ్బంది అధికారులపై చర్యలు*
*పనితీరు మెరుగుపరచని క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులపై భవిష్యత్తులోనూ కఠిన చర్యలు*
*జలధార – జలహారతి కార్యక్రమం లక్ష్య సాధనలో నిర్లక్ష్యం నేపథ్యంలో చర్యలు*
గంగవరం/ రంపచోడవరం– పెన్ పవర్
పోలవరం జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం వహించడం, గిరిజన శ్రామికులకు తగిన పనిదినాలు కల్పించడంలో విఫలమవడం, అలాగే జలధార – జలహారతి కార్యక్రమం లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి కారణాలతో జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఆదేశాల మేరకు 2 మంది ఏపీఓలు, 4 మంది టెక్నికల్ అసిస్టెంట్లు/బేర్ ఫుట్ టెక్నీషియన్లు, 4 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ విధుల నుండి తప్పించినట్లు డ్వామా పీడీ మహేశ్వరరావు తెలిపారు.
ఉపాధి హామీ పథకంలో ప్రతి మండలానికి నిర్దేశించిన పనిదినాల లక్ష్యాలను చేరుకోవడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు.గిరిజన ప్రాంతాల్లో శ్రామికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రభుత్వ పథకాల అమలుపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. పనితీరు అత్యంత నిరాశాజనకంగా ఉండటంతో కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.సస్పెండ్ అయిన ఏపీఓలలో వర రామచంద్రాపురం మండలానికి చెందిన ఎం. రెడ్డి బాబు లక్ష్యం 1,27,600 పనిదినాలకు గాను కేవలం 18,667 పనిదినాలు మాత్రమే సాధించి 15 శాతం ప్రగతితో జిల్లాలో 12వ స్థానంలో నిలిచారని, రంపచోడవరం మండలానికి చెందిన బండిల సత్యనారాయణ లక్ష్యం 1,46,000 పనిదినాలకు గాను 23,065 పనిదినాలు మాత్రమే సాధించి 16 శాతం ప్రగతితో జిల్లాలో 11వ స్థానంలో ఉన్నారని తెలిపారు.అదేవిధంగా రంపచోడవరం, కూనవరం మండలాలకు చెందిన టెక్నికల్ అసిస్టెంట్లు మరియు బేర్ ఫుట్ టెక్నీషియన్లు నిర్దేశించిన లక్ష్యాలకు చాలా తక్కువ స్థాయిలో పనులు నమోదు చేయడంతో వారిపై కూడా సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.అలాగే కూనవరం, చింతూరు, అడ్డతీగల మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామ స్థాయిలో పనుల పురోగతిని పెంచడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు.ఉపాధి హామీ పథకం అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, లక్ష్యాల సాధనలో విఫలమయ్యే అధికారులపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని డ్వామా పీడీ మహేశ్వరరావు హెచ్చరించారు.గిరిజన ప్రాంతాల్లో శ్రామికులకు గరిష్ట పనిదినాలు కల్పించేందుకు అధికారులు, క్షేత్ర స్థాయిలో సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
–

