రాజ్యసభకు చింతకాయల విజయ్ ఎంపికపై సర్వత్రా హర్షం
నర్సీపట్నం, పెన్ పవర్ :
పెద్దల సభకు యువ సంచలనం చింతకాయల విజయ్ ను ఎంపిక చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. 2009 ఎన్నికల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న చింతకాయల విజయ్ పడిన కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. సీనియర్ టిడిపి నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడుగానే కాకుండా, తనకంటూ సొంత ఇమేజ్ ను సృష్టించుకున్న వ్యక్తి చింతకాయల విజయ్. ఐ టిడిపిని స్థాపించి డిజిటల్, సోషల్ మీడియా రంగంలో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన వేదికను ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల నుండి ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ, పార్టీ అవసరాలకు అనుగుణంగా తన వ్యక్తిగత లక్ష్యాలను పక్కన పెట్టారు. నాలుగున్నర దశాబ్దాలుగా అయ్యన్న కుటుంబం తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉండటం వల్ల వచ్చిన గుర్తింపుగా పార్టీ క్యాడర్ భావిస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించడం, సమకాలీన రాజకీయాలపై మంచి పట్టు ఉండటం, హిందీ ఇంగ్లీష్ భాషలలో అనర్గళగా మాట్లాడటం విజయ్ కు అదనపు అర్హతలుగా నిలిచాయి. ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత ప్రతిపక్షంగా అప్పటి ప్రభుత్వాన్ని నిలదీయడం, వేధింపులను తట్టుకొని నిలబడటం పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా గుర్తించింది అనడంలో సందేహం లేదు. రాజ్యసభ రేసులో హేమాహేమీలు ఉన్నప్పటికీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ తో ఉన్న పరిచయాలు, పార్టీ కోసం చేసిన త్యాగాలు, పదవి వరించడానికి కారణమయ్యాయి. సహజంగా రాజ్యసభకు సీనియర్లు, మల్టీ మిలీనియర్లను, పార్టీకి ఆర్థికంగా సహకరించిన వారిని ఎంపిక చేస్తుంటారు. కానీ ప్రస్తుతం లోకేష్ నాయకత్వంలో పార్టీలోకి యువ రక్తం నింపుతున్నారు. పెద్దల సభకు యువకులను ఎంపిక చేయడం ద్వారా తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. రాజ్యసభకు చింతకాయల విజయ్ పేరు ప్రకటించగానే నర్సీపట్నంలో సందడి నెలకొంది. పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కి సంబరాలు చేసుకున్నారు. నర్సీపట్నం లోని ప్రధాన కూడళ్ళల్లో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఆదివారం ఉదయం రాజ్యసభకు విజయ్ పేరును ఎంపిక చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, పార్టీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావులకు కృతజ్ఞతలు తెలుపుతూ నర్సీపట్నం ప్రధాన రహదారులపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ వేయడం, పార్లమెంటు సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేయడం ఇక లాంఛనమే. ఆరు సంవత్సరాల కాలం ఉండే ఈ పదవికి చింతకాయల విజయ్ మరింత వన్నె తెచ్చి, ఈ ప్రాంత అభివృద్ధికి తండ్రితో పాటు కృషి చేయాలని నర్సీపట్నం ప్రజలు కోరుతున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా రాష్ట్రంలోనే నర్సీపట్నంకు అయ్యన్నపాత్రుడు గుర్తింపు తీసుకువస్తే, ఆయన వారసుడుగా విజయ్ నర్సీపట్నంకు ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తెచ్చారని స్థానికులు అభినందిస్తున్నారు.

