పేరు మార్చడంపైనే శ్రద్ధ.. కిట్ల పంపిణీలో నిర్లక్ష్యమని విమర్శ
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జూలై 2: రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమై మూడు వారాలు దాటినా విద్యార్థులకు అందాల్సిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ కాకపోవడంపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో అమలైన ‘జగనన్న విద్యా కానుక’ పథకానికి పేరు మార్చడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని, కానీ విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులు, యూనిఫాం వస్త్రాలు, షూస్ తదితర సామగ్రిని సకాలంలో అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు విద్యా కానుక కిట్లు అందించేవారని, దీంతో విద్యార్థులు కొత్త ఉత్సాహంతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం మాత్రం పాఠశాలలు ప్రారంభమై మూడు వారాలు గడిచినా కిట్లు అందకపోవడంతో విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో ఉపయోగించిన పాత బ్యాగులు, పాత యూనిఫాంలతోనే పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రభుత్వం వందల కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు ప్రకటించినప్పటికీ, ఆ నిధులకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో కిట్ల పంపిణీ కనిపించడం లేదని ప్రశ్నించారు.విద్యార్థుల సంక్షేమాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని, ఆలస్యం లేకుండా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బొబ్బిలి లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

