Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంప్రైవేటీకరణ వద్దు – జాతీయీకరణ ముద్దు

ప్రైవేటీకరణ వద్దు – జాతీయీకరణ ముద్దు

పేదలు, దళితులకు భూ పంపిణీ చేసి రిజర్వేషన్లకు రక్షణ కల్పించాలి

దళిత విముక్తి ఆధ్వర్యంలో విశాఖలో ర్యాలీ, బహిరంగ సభ

విశాఖపట్నం, జూలై 2 (పెన్ పవర్):

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేసి జాతీయీకరణ విధానాన్ని అమలు చేయాలని, పేదలు, దళితులకు భూములు పంపిణీ చేసి రిజర్వేషన్లను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత విముక్తి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు.

డాబాగార్డెన్స్‌లోని ఎల్‌ఐసీ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, ఆశీల్‌మెట్ట మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పలువురు దళిత, ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించారు.

వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో భూగరిష్ట పరిమితి చట్టాలకు విరుద్ధంగా వేలాది ఎకరాల భూములు భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయని, ప్రభుత్వ భూములు కూడా పెద్దఎత్తున ఖాళీగా ఉన్నప్పటికీ భూమిలేని పేదలకు పంపిణీ చేయడం లేదని విమర్శించారు. గతంలో దళితులు, పేదలకు సాగు కోసం పంపిణీ చేసిన భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని తిరిగి అసలు లబ్ధిదారులకు అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

దళితులకు మూడు ఎకరాల చొప్పున సాగుభూమి పంపిణీ చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో రాష్ట్రంలో ఎక్కడా అమలు కాలేదని ఆరోపించారు. భూమిలేని పేదలకు తక్షణమే సాగుభూములు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

దేశ అభివృద్ధికి వెన్నెముకగా నిలిచిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కావాలనే నష్టాల్లోకి నెట్టి ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్నారని విమర్శించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సూచించినట్లుగా పరిశ్రమలు, భూములు, సహజ వనరులు జాతీయీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేటీకరణ వల్ల రిజర్వేషన్లకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష, అంటరానితనం తొలగిపోలేదని, వారికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని కోరారు.

ర్యాలీ సందర్భంగా “పేదలకు భూములు పంచాలి”, “రిజర్వేషన్లను పరిరక్షించాలి”, “ప్రైవేటీకరణ వద్దు – జాతీయీకరణ కావాలి”, “డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు అమలు చేయాలి” అంటూ నినాదాలు చేశారు. దళిత విముక్తి కళాబృందం చైతన్య గీతాలతో కార్యక్రమాన్ని ఉత్తేజభరితంగా నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో కె. రవి, ఎం.ఎన్. బుద్ధ, శరత్, డాక్టర్ బూసి వెంకటరావు, కొత్తపల్లి వెంకటరమణ, బొడ్డు కళ్యాణరావు, వై. నూకరాజు, నటరాజ్, ఆటవ భాస్కర్, నీలంరాజు, పి. భాస్కర్, బంకపల్లి అప్పారావు, బి. సన్యాసమ్మ, యు. శివ, ఎన్. వరలక్ష్మి, బోనెల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular