ఆదివారం సాయంత్రం వరకు సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగింపు
కాకినాడ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్ జూలై 3: అమలాపురం పార్లమెంటు పరిధిలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సారధుల దరఖాస్తుల స్వీకరణ, సమాచార సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొంటుండటంతో దరఖాస్తుదారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను జూలై 5 (ఆదివారం) సాయంత్రం వరకు పొడిగించారు. స్థానిక సత్యనారాయణ గార్డెన్స్‌లో జూలై 4, 5 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ, సమాచార సేకరణ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. అమలాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ విషయాన్ని అమలాపురం పార్లమెంటు పరిశీలకులు, ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

