పోలీసు డ్రైవర్ల కోసం ఎయిర్ కండిషన్ వెయిటింగ్ హాలు ప్రారంభం
వాట్సాప్ సందేశంతో సమస్యను గుర్తించిన సీపీ.. తక్షణమే సౌకర్యం కల్పించిన అధికారులు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 03 : నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., ఈ రోజు పోలీసు మోటార్ ట్రాన్స్పోర్ట్ నందు పోలీసు డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్ వెయిటింగ్ హాలును ప్రారంభించారు. పోలీసు డ్రైవర్లకు పగలు, రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకునేందుకు ఇంతవరకు సరైన సౌకర్యం లేకపోవడంతో, అక్కడ పనిచేస్తున్న ఓ డ్రైవర్ వాట్సాప్ సందేశం ద్వారా ఈ సమస్యను సీపీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీపీ గారు డ్రైవర్ల కోసం ఎయిర్ కండిషన్ గల వెయిటింగ్ హాలు సిద్ధం చేయాలని ఆదేశించడంతో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ఈ హాలులో రాత్రి అత్యవసర విధులకు హాజరుకావాల్సిన 12 మంది డ్రైవర్లు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే విశాఖపట్నం వచ్చినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్ల డ్రైవర్లు తమ వాహనాలను పోలీసు గార్డు సమక్షంలో మోటార్ ట్రాన్స్పోర్ట్‌లో నిలిపి రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఈ హాలు ఉపయోగపడనుంది. ఈ సౌకర్యం కల్పించినందుకు డ్రైవర్లంతా సీపీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ డ్రైవర్లు ఆరోగ్యవంతంగా, సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు చేయించాలని సూచించారు. అదేవిధంగా పోలీసు వాహనాలన్నింటికీ పొల్యూషన్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్, డ్రైవర్లకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా చూడాలని ఆదేశించారు. పోలీసు డ్రైవర్లు కోరిన టీవీ, మినరల్ వాటర్ సౌకర్యం, వాహనాలు శుభ్రపరచుకునేందుకు అవసరమైన బోర్వెల్, క్వార్టర్ ట్యాంక్ తదితర సదుపాయాలను త్వరలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

