నర్సీపట్నం, పెన్ పవర్:
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం జిల్లా పోలీసు శాఖ చేపట్టిన “అభయ” ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం టౌన్ మరియు రూరల్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు నర్సీపట్నం టౌన్ పోలీసులు వుడా రెసిడెన్సి లో, రూరల్ పోలీసులు వేములపూడి లోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలోనూ కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని వుడా ఫంక్షన్ హాల్లో మహిళల భద్రత, చట్టపరమైన రక్షణ, అత్యవసర సహాయ సేవలు, సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నర్సీపట్నం టౌన్ సిఐ షేక్ గఫూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ షేక్ గఫూర్ మాట్లాడుతూ, “మీ భద్రత… మా బాధ్యత” అనే నినాదంతో మహిళలకు ఎల్లప్పుడూ పోలీసు శాఖ అండగా ఉంటుందని తెలిపారు. మహిళలు ఎలాంటి వేధింపులు, ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళా హెల్ప్‌లైన్ 181, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. మహిళలపై జరిగే వేధింపులు, సైబర్ నేరాల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ ఉపాధ్యాయులు, కళాశాల విద్యార్థులు, మహిళా పోలీసు సిబ్బంది, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

