రోడ్డు మంజూరు చేసి వెంటనే నిర్మాణం చేపట్టాలని గ్రామస్తుల ఆందోళన
గంగవరం, పెన్ పవర్, జూలై 15:
పోలవరం జిల్లా గంగవరం మండలంలోని కుసుమరాయి–కొమరవరం గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారిని తక్షణమే మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని కుసుమరాయి గ్రామానికి చెందిన సుమారు వంద మంది గ్రామస్తులు బుధవారం రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. గ్రామానికి అత్యంత కీలకమైన ఈ రహదారి దాదాపు పదేళ్లుగా అధ్వాన్న స్థితిలో ఉండటంతో నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామస్తుల కథనం ప్రకారం, వర్షాకాలం ప్రారంభమైన ప్రతిసారి రహదారి పూర్తిగా బురదమయంగా మారి రాకపోకలకు అనుకూలంగా ఉండడం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్ సైతం గ్రామంలోకి చేరలేని పరిస్థితి నెలకొంటోందని తెలిపారు. ఇతర వాహనాలు కూడా ఈ రహదారిపై ప్రయాణించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.గంగవరం మండల కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ గ్రామాలకు సరైన రహదారి లేకపోవడం విచారకరమని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రహదారి నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, పోలవరం జిల్లా కలెక్టర్ స్పందించి రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాయం వెంకటేశ్వర్లు, సారపు తమన్న దొర, సారపు కామరాజు, చవలం శ్రీనివాస్, కారం విజయలక్ష్మి, తాము ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

