కాకినాడ జిల్లా పెన్ పవర్ ప్రతినిధి,జూలై 15: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు బుధవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహం వద్ద రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరై ముద్రగడ భౌతికకాయానికి నివాళులర్పించడం విశేషంగా నిలిచింది.ముద్రగడతో తనకున్న ఆత్మీయ అనుబంధానికి నిదర్శనంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆయన పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ దృశ్యం అక్కడికి వచ్చిన అభిమానులను, కార్యకర్తలను భావోద్వేగానికి గురి చేసింది.
అంత్యక్రియలకు ఒకవైపు వైసీపీ శ్రేణులతో కలిసి జగన్ హాజరు కాగా, మరోవైపు రాష్ట్ర మంత్రులు వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌తో పాటు కూటమి నాయకులు, ముద్రగడ అభిమానులు, వివిధ పార్టీల నేతలు భారీ సంఖ్యలో తరలిరావడంతో కిర్లంపూడి జనసంద్రమైంది.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం సేవలను పలువురు నేతలు స్మరించుకున్నారు.
అంత్యక్రియలకు ముందు ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి తన తండ్రి పార్థివదేహాన్ని సందర్శించేందుకు రాగా, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆమె వెనుదిరిగిన ఘటన అక్కడ కొంత ఉద్రిక్తతకు దారితీసింది.ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, కాకినాడ లోక్‌సభ సభ్యుడిగా సేవలందించారు. కాపు ఉద్యమానికి జీవితాంతం అంకితభావంతో పనిచేసిన ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు, సామాజిక ఉద్యమాలకు తీరని లోటని పలువురు నేతలు నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు,ముద్రగడ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

