ఆంధ్రా యూనివర్సిటీలో ‘ఏజెంటిక్ ఏఐ’పై అవగాహన సదస్సు
విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సారించాలి: వెంకట రమణ సత్యవరపు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జులై 29 : ఆంధ్రా యూనివర్సిటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థినులకు ఉపయోగపడేలా “ఏజెంటిక్ ఏఐ (Agentic AI)” అంశంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలీవియా ఏఐ వ్యవస్థాపకులు, సీఈఓ వెంకట రమణ సత్యవరపు ముఖ్య అతిథిగా హాజరై కృత్రిమ మేధస్సు భవిష్యత్ అవకాశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వినూత్న ఆలోచనలు, పరిశోధనాత్మక ప్రాజెక్టులు, వాస్తవ జీవిత సమస్యలకు సాంకేతిక పరిష్కారాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. కృత్రిమ మేధస్సు పరిణామ క్రమాన్ని వివరిస్తూ, మానవ జోక్యం లేకుండానే స్వతంత్రంగా ఆలోచించి, ప్రణాళికలు రూపొందించి, సంక్లిష్ట పనులను నిర్వహించే ఏజెంటిక్ ఏఐ సామర్థ్యాలను వివరించారు.
అలాగే ట్రాన్స్‌ఫార్మర్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ (RAG), లాంగ్‌చైన్ (LangChain), ఎంసీపీ (MCP), ఏజెంట్-టు-ఏజెంట్ (A2A) కమ్యూనికేషన్ వంటి ఆధునిక ఏఐ సాంకేతికతల ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రస్తుత ఏఐ యుగంలో విద్యార్థులు ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు నిరంతర అధ్యయనం, కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తిని అలవర్చుకోవాలని సూచించారు. డేటా డ్రిఫ్ట్, అల్గోరిథమ్ డ్రిఫ్ట్ వంటి సవాళ్లను ప్రస్తావిస్తూ నాణ్యమైన డేటా వినియోగం, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి అవసరమని పేర్కొన్నారు.
అనంతరం విశ్వవిద్యాలయం తరఫున వెంకట రమణ సత్యవరపును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్. పద్మశ్రీ, అసిస్టెంట్ ప్రిన్సిపాల్, ఐటీ & సీఏ విభాగాధిపతి ప్రొఫెసర్ బి. ప్రజ్ఞ, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ ఎస్. అరుణ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

