-టీజీహెచ్‌బీ-దుండిగల్ రెవెన్యూ సంయుక్త సర్వే నిర్వహణ..
-హద్దులు నిర్ధారించి.. బౌండరీ మార్కింగ్ పూర్తి..! ‘బోర్డులు, ఫెన్సింగ్’ పెండింగ్..!
-‘పెన్ పవర్’ ప్రత్యేక కథనానికి వెంటనే స్పందించిన రెండు శాఖల అధికారులు..
-మొన్న మూడు అక్రమ బేస్మెంట్లు కూల్చివేసిన రెవెన్యూ..
-నిన్న ‘టీజీహెచ్‌బీ-రెవెన్యూ’ జాయింట్ సర్వేలో 21 ఎకరాలకు హద్దులు ‘ఫిక్స్’..!
-త్వరలో హెచ్చరిక బోర్డులు, శాశ్వత ఫెన్సింగ్ పెడతామని వెల్లడి..
-ప్రభుత్వ భూమిలో ప్లాట్లు కొనొద్దని ప్రజలకు అధికారుల హెచ్చరిక..
తెలంగాణ హౌసింగ్ బోర్డ్‌కు కేటాయించిన బౌరంపేట్ సర్వే నెంబర్ 472, చెందిన 21 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకు అధికారులు చెక్ పెట్టారు.. ఏకంగా లేఅవుట్లు వేసి, అమాయకులే లక్ష్యంగా ఎంచుకుని, ప్లాట్లు విక్రయిస్తున్న కబ్జాదారులకు అధికారులు కళ్ళెం వేశారు..”పెన్ పవర్ దినపత్రిక”లో వచ్చిన ప్రత్యేక కథనాలతో ‘టిజిహెచ్బి-రెవెన్యూ’ యంత్రాంగం అప్రమత్తం అయింది.. మొన్న 3 బేస్మెంట్లు కూల్చివేసిన అధికారులు, మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. టిజిహెచ్బికి చెందిన 21 ఎకరాలకు గురువారం సర్వే నిర్వహించి, హద్దులు నిర్ధారించారు.. నేడు(శుక్రవారం) హెచ్చరిక బోర్డులు, ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని టిజిహెచ్బి డీఈఈ వాణి ‘పెన్ పవర్’ ప్రతినిధితో ప్రస్తావించారు..
మాధవ్ పత్తి.. మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఆగష్టు 6:
గండిమైసమ్మ-దుండిగల్ మండలం బౌరంపేట్ సర్వే నెంబర్ 472, ప్రభుత్వ భూముల పరిరక్షణకై ‘పెన్ పవర్’ దినపత్రిక ప్రచురించిన వరుస ప్రత్యేక కథనాలు మరోసారి అధికారులను కదిలింప చేసింది.. “ప్రభుత్వ భూములకు రక్షణేది..? కబ్జాదారులకు అడ్డేది..?” అన్న కథనం వెలువడిన వెంటనే దుండిగల్ రెవెన్యూ యంత్రాంగం స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రభుత్వ భూమిలో నిర్మించిన, మూడు బేస్మెంట్ లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు.. తాజాగా తెలంగాణ హౌసింగ్ బోర్డు (టీజీహెచ్‌బీ) అధికారులు, దుండిగల్ రెవెన్యూ అధికారులు, బౌరంపేట్ సర్వే నెం.472లో జాయింట్ సర్వే నిర్వహించి, ప్రభుత్వ భూమి హద్దులను ఖరారు చేశారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ భూమి మొత్తం సరిహద్దులను గుర్తించి బౌండరీ రాళ్లు ఏర్పాటు చేశారు.. భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా 472 భూములకు శాశ్వత రక్షణ కల్పించేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు..

సర్వే నెం.472 ప్రభుత్వ భూమిని కాపాడినట్టేనా..?
బౌరంపేట్ గ్రామంలోని సర్వే నెం.472లో మొత్తం 31.34 ఎకరాల ప్రభుత్వ భూమి పూర్తిగా రక్షించినట్టేనా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. అందుకు కారణాలు లేకపోలేదు..గాగిల్లాపూర్‌లో కలెక్టర్ డి-నోటిఫికేషన్ చేసిన భూదాన్ భూములనే కబ్జాదారులకు వదిలేసిన ఘనత దుండిగల్ రెవెన్యూ అధికారులకే దక్కింది.. చర్యలు తీసుకున్న మరికొన్ని అక్రమ నిర్మాణాలు మళ్ళీ నిర్మించుకునేందుకు ఉదారత చాటిన రెవెన్యూ అధికారులపై ఈ మాత్రం ఆరోపణలు, అనుమానాలు వ్యక్త పరచడం తప్పేముందని పలువురు వ్యంగ్యారోపణలు చేస్తున్నారు..
లేఅవుట్-విక్రయాలపై ప్రశ్నలు..!
బౌరంపేట్ సర్వే నెం.472 ప్రభుత్వ భూమిలో, దాదాపు 21 ఎకరాలు గతంలో దిల్ నిర్మాణ సంస్థకు కేటాయించిందే.. దిల్ సంస్థ ప్రస్తుతం తెలంగాణ హౌసింగ్ బోర్డు (టీజీహెచ్‌బీ) ఆధీనంలోకి మారాయి.. అయితే ఈ భూమిని కొందరు అక్రమార్కులు అసైనీల నుంచి కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతుండగా..! సంబంధిత 472 ప్రభుత్వ భూమిలో, కొందరు కబ్జాదారులు లేఅవుట్ చేసి, నోటరీ పత్రాలతో అమాయక ప్రజలకు ప్లాట్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.. ఈ అక్రమాలపై ‘పెన్ పవర్’ వరుస కథనాలు ప్రచురించగా, సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ స్పందించి దుండిగల్ తహశీల్దార్ రాజేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, శాశ్వత ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.. ఫిర్యాదు, కథనాలను పరిశీలించిన తహశీల్దార్ వెంటనే స్పందించి ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న మూడు బేస్మెంట్లను కూల్చివేయించారు. అనంతరం టీజీహెచ్‌బీ అధికారులతో కలిసి, గురువారం జాయింట్ సర్వే నిర్వహించి హద్దులను ఖరారు చేశారు..

హద్దులు నిర్ధారించి గెట్టు రాళ్ళు ఏర్పాటు..
జాయింట్ సర్వేలో అధికారులు ప్రభుత్వ భూమిలో హద్దులను గుర్తించి బౌండరీ మార్కింగ్ పూర్తి చేశారు. త్వరలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, మొత్తం భూమికి శాశ్వత ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ భూమి రక్షణకు ఇది కీలక చర్యగా అధికారులు పేర్కొన్నారు.. మరోవైపు బౌరంపేట్ సర్వే నెం.472లో ఎలాంటి ప్లాట్లనూ ప్రజలు ఎవరూ కొనుగోలు చేయవద్దని దుండిగల్ తహశీల్దార్ రాజేశ్వర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూమిలో జరిగే లావాదేవీలు చట్టబద్ధం కావని, అలాంటి ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు..
బౌరంపేట్ 472 ప్రభుత్వ భూమి పరిరక్షణకై, టిజిహెచ్బి-రెవెన్యూ అధికారులు తీసుకున్న చర్యలను ఆకుల సతీష్ స్వాగతించారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ, ఫెన్సింగ్ పూర్తయ్యే వరకు, అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను పూర్తిగా రక్షించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.. మరోవైపు హెచ్చరిక బోర్డుల ఏర్పాటు వ్యవహారంలో, వ్యవసాయం చేస్తున్న కొందరు అసైనీలు ఒకరోజు గడువు కోరినట్లు సమాచారం.. సర్వే నెంబర్ 472 పరిస్థితి ఇంతవరకు వచ్చినా..! తహశీల్దార్‌తో మాట్లాడు కుంటామని, అసైనీలు (వ్యవసాయం చేసేవారు) సమయం కోరడపై పలు అనుమానాలకు తావిస్తోంది..? కబ్జాదారునికి కట్టబెట్టేందుకు, బోర్డులు పెట్టకుండా, పథకం వేస్తున్నారా..? లేక రాజకీయ నాయకులతో సిఫార్సులు చేయించి, అసలు బోర్డులే పెట్టకుండా, పన్నాగం పన్నుతున్నారా, అన్న అనుమానాలను రేకెత్తిస్తుంది.. మరోవైపు తమ 21 ఎకరాలు తాము స్వాధీన పరుచుకోవడం పూర్తయిందని, మిగతా విషయం తమకు సంబంధం లేదని, తమ పరిధిలో, బోర్డులు, ఫెన్సింగ్, వెంటనే ఏర్పాటు చేస్తామని, టిజిహెచ్బి డీఈఈ వాణి స్పష్టం చేశారు..

