Homeఆంధ్రప్రదేశ్అమరావతిస్థానిక ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరం

స్థానిక ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరం

మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు ఈవీఎంలా?.. బ్యాలెట్‌ బాక్సులా?

123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలపై దృష్టి..

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ఈసీ ఆదేశాలు

ఒంగోలు,  పెన్ పవర్ ఆగస్టు 8,:

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగం పుంజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడు మోగినా ఎదుర్కొనేలా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పెండింగ్‌ అంశాలు, కోర్టు కేసులు, ఓటర్ల జాబితాలు, ఎన్నికల సామగ్రి, సిబ్బంది సన్నద్ధత తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్‌ బాక్సులు వినియోగించాలా? లేక ఈవీఎంలను ఉపయోగించాలా? అనే అంశం అధికారుల సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న బ్యాలెట్‌ బాక్సులు, ఈవీఎంల వివరాలను అధికారులు ఎన్నికల కమిషన్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది.

2021 ఎన్నికల అనుభవంపై సమీక్ష

గతంలో 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరును అధికారులు సమీక్షించారు. అప్పటి ఏర్పాట్లు, ఎదురైన సమస్యలు, ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రానున్న ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ముందుగానే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల తేదీ ప్రకటించే సమయానికి యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

123 మున్సిపల్ సంస్థలపై దృష్టి

రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమావేశంలో వెల్లడైంది. కొన్ని పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండటంతో వాటి పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు. పురపాలక శాఖ పరిధిలో మొత్తం 23 కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో నాలుగు ఇప్పటికే పరిష్కారమైనట్లు సంబంధిత అధికారులు వివరించినట్లు సమాచారం. మిగిలిన కేసులను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

13,359 పంచాయతీలపైనా కసరత్తు

గ్రామ పంచాయతీల విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్తం 13,359 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2021లో 354 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేకపోయిన అంశాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే సమావేశంలో ప్రజెంటేషన్‌ ద్వారా వివరించినట్లు తెలిసింది. పురపాలక శాఖతో సమన్వయం చేసుకుంటూ పెండింగ్‌ కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల తుది జాబితా ప్రచురణ, పోలీస్‌ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది సన్నద్ధత తదితర అంశాలపై కూడా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

ఈవీఎంలా?.. బ్యాలెట్‌ బాక్సులా?

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఈవీఎంలు లేదా బ్యాలెట్‌ బాక్సుల వినియోగం అంశంపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు సమాచారం. జిల్లాల వారీగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాలెట్‌ బాక్సులు, ఈవీఎంల సంఖ్య, వాటి వినియోగ సామర్థ్యం తదితర వివరాలను అధికారులు సమర్పించారు. ఎన్నికల ప్రక్రియ, స్థానిక సంస్థల స్వరూపం, అందుబాటులో ఉన్న ఎన్నికల సామగ్రి, నిర్వహణ వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

బడ్జెట్‌పైనా చర్చ

2021లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుమారు రూ.3.5 కోట్ల వరకు బడ్జెట్‌ కేటాయించినట్లు సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఈసారి ఎన్నికల నిర్వహణకు ఎంత వ్యయం అవుతుంది? అవసరమైన నిధులను ఎలా సమకూర్చుకోవాలి? అనే అంశాలపైనా అధికారులు చర్చించినట్లు సమాచారం. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమిషన్‌ కసరత్తు వేగవంతం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వెలువడుతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, అప్పటికి ఎలాంటి హడావుడి లేకుండా యంత్రాంగాన్ని సిద్ధం చేయడంపైనే ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular