న్యాయ వృత్తిలో రాణించాలంటే కష్టానికి ప్రత్యామ్నాయం లేదు
తొలి ఐదేళ్లు కష్టపడి పనిచేస్తే అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు:
అడిషనల్ సొలిసిటర్ జనరల్ బ్రిజేష్ బన్సల్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 9:
న్యాయవాద వృత్తిలో రాణించేందుకు దగ్గరదారి అంటూ ఏదీ లేదని, నిరంతరం కష్టపడి పనిచేస్తేనే అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని భారత అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సీనియర్ అడ్వకేట్ బ్రిజేష్ బన్సల్ అన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత తొలి ఐదేళ్లు ఎంతో కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఒకసారి తమ ప్రతిభను నిరూపించుకున్న తర్వాత అవకాశాలు వాటంతట అవే వస్తాయని, అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని తెలిపారు. అనేక మంది సీనియర్ న్యాయవాదులు, న్యాయమూర్తులు తమ ప్రతిభతో ఉన్నత స్థాయికి చేరుకున్నారని, తాను కూడా అందుకు ఒక ఉదాహరణనని పేర్కొన్నారు.
న్యాయవాద వృత్తిలోకి కొత్తగా వచ్చిన వారు కనీసం తొలి రెండేళ్లు ట్రయల్ కోర్టుల్లో పనిచేస్తే మంచి ప్రాక్టికల్ అనుభవం లభిస్తుందని చెప్పారు. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో తమ ప్రాక్టీస్‌ను విస్తరించుకోవచ్చని సూచించారు. నేటి న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం (మెడియేషన్) ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోందని, విద్యార్థులు ఈ రంగంలోనూ నైపుణ్యం సాధించాలని పిలుపునిచ్చారు.
సీనియర్ న్యాయవాదులు కోర్టుల్లో కేసులను వాదించే విధానాన్ని నిశితంగా గమనించడం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చని బన్సల్ తెలిపారు. నిరంతర అధ్యయనం, పరిశీలన, అనుభవం న్యాయవాద వృత్తిలో విజయానికి కీలకమని విద్యార్థులకు వివరించారు.
విద్యార్థుల ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానాలు
ప్రసంగం అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు బ్రిజేష్ బన్సల్ ఎంతో ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు. తాము చదువుకున్న విశ్వవిద్యాలయాన్ని, గురువులను ఎల్లప్పుడూ గౌరవిస్తూ ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులతో రెండు, మూడు గంటలు గడపడం ఎంతో ఆనందంగా ఉందని, తన అనుభవాలను భవిష్యత్తులో న్యాయవాద వృత్తిలోకి రాబోయే నేటితరంతో పంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
విశాఖపట్నం ఎంతో అందమైన నగరమని, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సైతం పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉందని ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులో తరచూ విశ్వవిద్యాలయానికి వచ్చి విద్యార్థులతో సంభాషించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
విశ్వవిద్యాలయాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ సూర్యప్రకాశరావును ఈ సందర్భంగా బ్రిజేష్ బన్సల్ అభినందించారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఇన్చార్జి విశ్వచంద్రనాథ్ మాదాసు, అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సోమభట్ట ఆచార్య, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

