Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నం30 ఏళ్ల తర్వాత.. ఒక్కచోట చేరిన చిన్ననాటి స్నేహితులు మింది జడ్పీ పాఠశాల పూర్వ విద్యార్థుల...

30 ఏళ్ల తర్వాత.. ఒక్కచోట చేరిన చిన్ననాటి స్నేహితులు మింది జడ్పీ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

30 ఏళ్ల తర్వాత.. ఒక్కచోట చేరిన చిన్ననాటి స్నేహితులు

మింది జడ్పీ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం,గాజువాక, ఆగస్టు 9: మూడు దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్న స్నేహితులు 30 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గాజువాక మండలం మింది జడ్పీ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

వివిధ ప్రాంతాలు, జిల్లాలతో పాటు విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో సమ్మేళనానికి హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే తమ హోదాలు, స్థాయిలను పక్కనపెట్టి చిన్ననాటి స్నేహితులను ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలుసుకుంటూ ఆనందంగా గడిపారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల్లో పాల్గొని సందడి చేశారు. మూడు దశాబ్దాల తర్వాత తమ చిన్ననాటి స్నేహితులందరినీ ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో ఆనందంగా, మరచిపోలేని అనుభూతిగా ఉందని పలువురు పూర్వ విద్యార్థులు తెలిపారు.

జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, వివిధ ప్రాంతాలు, జిల్లాలు, విదేశాల్లో స్థిరపడిన తన చిన్ననాటి స్నేహితులందరూ ఒక్క పిలుపుకే స్పందించి పెద్ద సంఖ్యలో హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కష్టసుఖాలను పంచుకోవడానికి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు.

వయసు పెరిగినా తమ మధ్య ఉన్న స్నేహబంధం ఏమాత్రం తగ్గలేదని, చిన్ననాటి జ్ఞాపకాలు జీవితాంతం మధురంగానే నిలిచిపోతాయని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.

కార్యక్రమం ముగింపులో సమ్మేళనానికి హాజరైన ప్రతి పూర్వ విద్యార్థిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. దీంతో మింది జడ్పీ పాఠశాల ప్రాంగణం పూర్వ విద్యార్థుల ఆత్మీయ పలకరింపులు, నవ్వులు, సందడితో కళకళలాడింది. కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్న స్పర్శ మసాలా కంపెనీ ప్రతినిధులకు పూర్వ విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular