గార్ల, పెన్ పవర్, ఆగస్టు 24:
ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా స్వీకరించి పరిష్కరించడమే ప్రజావాణి లక్ష్యమని ఎంపీడీవో మంగమ్మ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి దరఖాస్తులు అందజేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించగా గృహ నిర్మాణానికి సంబంధించి 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి 1 పోలీస్ శాఖకు సంబంధించి 2 రెవెన్యూ శాఖకు సంబంధించి 1 అటవీ శాఖకు సంబంధించి 2 మొత్తం 11 దరఖాస్తులు వచ్చినట్లు నోడల్ అధికారి ఎంపీడీవో మంగమ్మ తెలిపారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రతి దరఖాస్తు పై బాధ్యతగా స్పందించి సమస్యల పరిష్కారంలో అధికారులు జాప్యం లేకుండా చూడాలని ఆమె పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి 18 మంది మండల స్థాయి అధికారులు హాజరుకాగా మత్స్యశాఖ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ విద్యుత్ శాఖ అధికారులు గైర్హాజరయ్యారు.

