Homeఆంధ్రప్రదేశ్కాకినాడఅప్పన్నపాలెం బ్రిడ్జి నిర్మాణంలో మంత్రుల హామీలు ఏమయ్యాయి?!

అప్పన్నపాలెం బ్రిడ్జి నిర్మాణంలో మంత్రుల హామీలు ఏమయ్యాయి?!

 

ఏలేశ్వరం, పెన్ పవర్, ఆగస్టు 25: ఏలేశ్వరం మున్సిపాలిటీ, జగ్గంపేట నియోజకవర్గాలకు అనుసంధానం చేయబడ్డ అప్పన్నపాలెం బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో మంత్రులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ గా ఉన్నప్పుడు 2009 లో అప్పటి టిడిపి ప్రభుత్వం ఏలేరు ప్రధాన కాలుపై అప్పన్నపాలెం బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించి 2002-03 మధ్య బ్రిడ్జి ప్రారంభమైంది. సుమారు 98 లక్షల రూపాయల వ్యయంతో వంతెన నిర్మించారు. దీంతో ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో అప్పన పాలెం తో పాటు ఇర్రిపాక, మామిడాడ మర్రిపాక , నరేంద్ర పట్నం తదితర సుమారు 16 గ్రామాల రైతాంగం తమ వ్యవసాయ ఉత్పత్తులను ఏలేశ్వరం మార్కెట్కు తరలించడానికి, ఎలిమెంటరీ విద్య అనంతరం పాఠశాల, కళాశాల విద్యను ఏలేశ్వరం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం పొందడానికి విద్యార్థులకు, వివిధవ్యాపారాలు నిర్వహించుకునే చెరువు వ్యాపారులకు, రోగులు వైద్య సేవలకు, ప్రజల నిత్య అవసరాలకు అప్పన్నపాలెం బ్రిడ్జి సుగమనానికి తోడ్పడింది.

2020 సెప్టెంబర్ లో వచ్చిన భారీ వరద వల్ల ఏలేరు జలాశయం నుండి 13 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయడంతో వరద ఉధృతికి వంతెన కాంక్రీట్ పిల్లర్స్ స్థానభ్రంశం చెందడంతో వంతెన కుంగింది. తాత్కాలిక కాలినడక రహదారి నిర్మాణానికి అప్పన పాలెం వాసులు వంతెన పై కర్రలతో ప్రజావసరాలకు కాలినడక దారి ఏర్పరిచారు. అనంతరం 2023 మార్చి 1న అప్పన పాలెం వంతెనలోని కాంక్రీట్ భాగం రెండు, ముక్కలుగా విరిగి కూలిపోయింది. దీంతో సమస్య జఠిలమైంది. అప్పటికే సుమారు మూడున్నర సంవత్సరాలుగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అయినా ప్రభుత్వాల నుండి సమస్యకు శాశ్వత పరిష్కారం రాలేదని అప్పటి నివేదిక పేర్కొంది. గ్రామస్తులు తాత్కాలికంగా మోటార్ సైకిల్ వెళ్లేందుకు కూలిన బ్రిడ్జిపై బ్రిడ్జిపై మట్టి చదును చేస్తుండగా వంతెన మరో భాగం కూలిపోయింది. 2023 సెప్టెంబర్ 1 న అప్పటి కాకినాడ ఎంపీ వంగా గీత ముఖ్యమంత్రి జగన్ ను కలిసి అప్పన్నపాలెం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపబడ్డాయి. వంతెన ప్రమాదకరంగా మారడంతో నిధులు మంజూరు చేయాలని అప్పటి సీఎంను ఎంపీ వంగా గీత కోరినట్లు మీడియా వెల్లడించింది. అయితే నిధులు మంజూరైనట్లు, ఏ విధమైన ప్రకటన వెలువలేదు. పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి అధికారులు అప్పనపాల వంతెనపై రాకపోకలను పూర్తిగా నిషేధించి, కొంతకాలం పోలీస్ పహారాలో ఉంచారు. అయితే వంతెన పూర్తిగా కృంగిపోవడంతో సుమారు 16 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోగా, ఆ గ్రామాల ప్రజలు ఏ అవసరానికైనా సుమారు 30 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చింది. 2024 కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రకరకాల ప్రకటనలు చేయడంతో ప్రజల డిమాండ్లకు ఆశాజనకం ఏర్పడింది. చిట్ట చివరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిణి 18 కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మించడానికి ప్రతిపాదన వచ్చినట్లు మీడియా ముఖంగా వెల్లడించారు. ఎక్కడ 18 కోట్ల డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ( డి పి ఆర్) ప్రతిపాదన ఉందని సమాచారం ఉన్నప్పటికీ ఇప్పటివరకు 18 కోట్లు మంజూరైనట్లు జీవో అయిందని, డి పి ఆర్, నిధుల మంజూరు అయినట్లు ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడ లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరలా అప్పన్నపాలెం బ్రిడ్జి నిర్మాణం కోసం నాయకులు ప్రకటన లు గుప్పించడానికి సిద్ధపడుతున్నారు అనే స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు . ఈ సమస్యను బూచిగా చూపి నాయకులు పబ్బం గడుపుకునేందుకు మరల బ్రిడ్జి నిర్మాణం పై హామీలు గుప్పిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఎన్ కన్వెన్షన్ హాల్ వద్ద జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈరోజు నుంచి సంవత్సరంలోపు నూతనంగా నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇవ్వడంతో పాటు, ఏలేశ్వరం మున్సిపాలిటీ అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జగ్గంపేట మండలంలో అప్పన పాలెం చేంతనే ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్ద జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో అప్పలపాలెం బ్రిడ్జి త్వరలో నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ మంత్రులు ఇచ్చిన హామీలు నేటికీ నీటి మూటలే అయ్యాయి. ఇప్పటివరకు ఏ విధమైన కార్యాచరణకు నోచుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఉంది. ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్తలు, ఏకే న్యూస్ ఏపీ ఎండి అధికార్ బుధవారం న శాంతియుత మార్గంలో ఒకరోజు ఉద్యమం చేపట్టనున్నట్లు ఒక ప్రకటన వెలువరించారు. అలాగే అప్పన పాలెం వంతెన శాశ్వత నిర్మాణం విషయంలో ముఖ్యమైన కార్యాచరణ ప్రకటించనున్నట్లు మంగళవారం వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular