14 మందికి రూ.6.30 లక్షల చెక్కులు.. ఇంటింటికీ వెళ్లి అందజేసిన జ్యోతుల నవీన్
గండేపల్లి, పెన్ పవర్ ,ఆగస్టు 27: అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు. గండేపల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.6.30 లక్షల విలువైన 14 చెక్కులను గురువారం లబ్ధిదారులకు అందజేశారు.

నీలాద్రిరావుపేటలో నలుగురికి, తాళ్లూరులో ఇద్దరికి, మల్లేపల్లిలో ముగ్గురికి, యల్లమల్లిలో ఒకరికి, నాయకంపల్లిలో ఇద్దరికి, ఎర్రంపాలెంలో ఇద్దరికి చెక్కులు మంజూరయ్యాయి. జ్యోతుల నవీన్ ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు వరంగా మారుతున్నాయన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుల, మత, పార్టీలకు అతీతంగా అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం పేరుకే పరిమితమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు వైద్యం అందని పరిస్థితి లేకుండా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోతుల మోహనరావు, జీను మణిబాబు, కందుల చిట్టిబాబు, కుంచె రాజా, జాస్తి వసంత్, అడబాల రామాంజనేయులు, బుర్రి సత్తిబాబు, కుంచె రామకృష్ణతో పాటు ఆయా గ్రామాల కూటమి నాయకులు పాల్గొన్నారు.

