కాజులూరు, పెన్ పవర్,ఆగస్టు 24: పాత గొడవలను పురస్కరించుకుని ఓ వ్యక్తిని హత్య చేసేందుకు రూ.50 వేలకు కిరాయికి మాట్లాడి ఇనుప రాడ్లతో దాడి చేయించిన ఘటనపై గొల్లపాలెం పోలీసులు 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం.. కాజులూరు గ్రామానికి చెందిన వట్టూరి బుల్లియ్య పై హత్యాయత్నం జరిగింది, పాత గొడవలను దృష్టిలో ఉంచుకుని బుల్లియ్యను హత్య చేయాలనే ఉద్దేశంతో కాజులూరుకు చెందిన వట్లూరి దుర్గారావు చందాల శివ సహకారంతో గంగనాపల్లి గ్రామానికి చెందిన మాన్యం గణేశ్వరరావు అలియాస్ గణేష్, బుర్రి స్వామి,నామ అమృతకుమార్ అలియాస్ పెద్దపండు, రావుల రాము అలియాస్ శ్రీరాము, నల్లల శశ్యామ్, పరస రాజేష్ అలియాస్ చినపండు అనే ఎనమండుగురిని రూ.50 వేలకు కిరాయికి మాట్లాడినట్లు తెలిపారు.పథకం ప్రకారం బుల్లియ్య పై ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై గొల్లపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు గొల్లపాలెం ఎస్‌ఐ ఆర్.వి.ఎన్. మూర్తి తెలిపారు.అరెస్టు చేసిన 8 మంది నిందితులను కాకినాడ మూడో ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. నిందితుల అరెస్టులో పోలీసు సిబ్బంది సహకరించారని తెలిపారు.

