Homeఆంధ్రప్రదేశ్కాకినాడపదవీ విరమణ ఉద్యోగానికే.. సేవాభావానికి కాదు: మంత్రి వాసంశెట్టి సుభాష్

పదవీ విరమణ ఉద్యోగానికే.. సేవాభావానికి కాదు: మంత్రి వాసంశెట్టి సుభాష్

రామచంద్రపురం, పెన్ పవర్ ఆగస్టు 31 : ఉపాధ్యాయులతోనే మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, గురువును మించిన దైవం లేరని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ, పదవీ విరమణ అనేది ఉద్యోగానికే తప్ప వ్యక్తిత్వానికి, సేవాభావానికి కాదని పేర్కొన్నారు. మనిషి సంపాదించుకున్న మంచి పేరు, సమాజానికి అందించిన సేవలు, చేసిన మంచిపనుల ప్రభావం శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు.
రామచంద్రపురం రూరల్ మండలం నరసాపురపుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి మాచిరాజు పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన సభకు మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, భావితరాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉందని అన్నారు. ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి మాచిరాజు విద్యాబోధనతో పాటు సామాజిక సేవలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారని మంత్రి కొనియాడారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తూ విద్యా ప్రమాణాల పెంపునకు ఆయన అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు మాచిరాజు చేసిన కృషి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సమాజానికి దిశానిర్దేశం చేసే ఇలాంటి ఉపాధ్యాయుల సేవలు పదవీ విరమణతో ముగియవని, వారి అనుభవం, సేవాభావం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మంత్రి సుభాష్ అన్నారు.అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబొరేటరీని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణతో కలిసి మంత్రి సుభాష్ ప్రారంభించారు. విద్యార్థులకు ఆధునిక విద్యా సదుపాయాలు అందుబాటులోకి రావడం ఆనందదాయకమని, ప్రయోగాత్మక విద్య ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం మరింత పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది, విద్యార్థులు,కూటమి పార్టీల నాయకులు,స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular