ఇబ్రహీంపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 11:
గణేష్ ఉత్సవాలు–2026 ఏర్పాట్లలో భాగంగా, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎం.మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులు, వీరపట్నం గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ, పోలీస్ కమిషనర్ జారీ చేసిన సూచనలు, మార్గదర్శకాలను నిర్వాహకులకు వివరించడంతో పాటు, ఉత్సవాల సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన చేయాల్సినవి, చేయకూడనివి గురించి అవగాహన కల్పించారు. గణేష్ మండపాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం, ట్రాఫిక్, శబ్ద నియంత్రణ నిబంధనలు పాటించడం, క్రమశిక్షణను కాపాడడం, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడడం, ఉత్సవాలు సురక్షితంగా, సజావుగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.పి.వి. రాజు, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐ, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్, ఇబ్రహీంపట్నం ఎస్‌హెచ్‌ఓ ఎం. మహేందర్ రెడ్డి, సంబంధిత పోలీస్ సిబ్బంది, నిర్వాహకులు పాల్గొన్నారు.

