ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి: వ్యవసాయ అధికారి సరిత
యూరియా, డీఏపీ కొరత లేదు.. రైతులు ఆందోళన చెందొద్దు
వేటపాలెం, సెప్టెంబర్ 22 (పెన్ పవర్): వేటపాలెం మండలంలోని అక్కాయపాలెం, పందిళ్లపల్లి రైతు సేవా కేంద్రాల వద్ద మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీమతి సరిత పాల్గొని రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరి సాగుకు అవసరమైన స్థాయిలో నీటి సరఫరా అందే అవకాశం తక్కువగా ఉన్నందున, రైతులు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మినుము, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకునే దిశగా ఆలోచించాలని సూచించారు. అదేవిధంగా మండలంలో ప్రస్తుతం యూరియా, డీఏపీ ఎరువులకు ఎలాంటి కొరత లేదని వ్యవసాయ అధికారి స్పష్టం చేశారు. పంటలు సాగు చేస్తున్న రైతులు తమ అవసరానికి అనుగుణంగా ఎరువులను తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఏఏ వినయ్ కుమార్, వీహెచ్ఎ సౌజన్యతో పాటు రైతులు పాల్గొన్నారు.

