ఖమ్మం, పెన్ పవర్ సెప్టెంబర్ 23 :
గణేషుడిని నవరాత్రి పాటు భక్తుల పూజలు, మంత్రోచ్ఛారణలు, భక్తి శ్రద్ధలతో కొలువుదీరిన విఘ్నేశ్వరుడు ఘనంగా వీడ్కోలు అందుకున్నారు. ఖమ్మం నగరంలోని నలుమూలల నుంచి వివిధ ఆకృతుల్లో అలంకరించబడిన గణనాథుల విగ్రహాలు భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాల మోత, భక్తుల నృత్యాల నడుమ నిమజ్జనానికి తరలివెళ్లాయి. చల్లటి చినుకులు కురుస్తున్నా భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వర్షపు చినుకులను సైతం విఘ్నేశ్వరుడి ఆశీస్సులుగా భావిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ వాహనాలపై వైభవంగా తరలివచ్చిన గణనాథులు భక్తుల జయజయధ్వానాల మధ్య ధంసలాపురం నిమజ్జన ఘాట్‌కు చేరుకున్నారు. డప్పుల మోతకు అనుగుణంగా యువత, మహిళలు, చిన్నారులు భక్తి నృత్యాలతో సందడి చేయగా, పరిసర ప్రాంతమంతా గణనాథుడి నామస్మరణతో మార్మోగింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల ఆధ్యాత్మిక భావోద్వేగాలకు కేంద్రంగా నిలిచిన విఘ్నేశ్వరుడికి కన్నుల పండువగా వీడ్కోలు పలికారు.
*భక్తులకు అండగా ‘టిడబ్ల్యూజేఎఫ్’ సేవలు*
నిమజ్జనానికి తరలివచ్చిన భక్తుల అలసటను గుర్తించి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ నాయకత్వం మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలను చేపట్టింది. ముస్తఫానగర్ ప్రాంతంలో భక్తులకు ఉచితంగా పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేయడంతో పాటు చల్లటి మంచినీటిని అందించారు. గంటల తరబడి నిమజ్జన వేడుకల్లో పాల్గొని అలసిపోయిన భక్తులకు ఈ సేవలు ఆప్యాయతను, ఆత్మీయతను పంచాయి. ఫెడరేషన్ నాయకులు శీలం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పులిహోర ప్రసాదం, మంచినీటి సేవలను టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు టిఎస్.చక్రవర్తి లు అభినందించారు. గణేష్ నిమజ్జన మహోత్సవంలో భక్తులకు ఆహారం, తాగునీరు అందించడం పుణ్యకార్యమే కాకుండా మానవత్వానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ, అదే సమయంలో నిమజ్జనానికి వచ్చిన భక్తులకు సేవ చేయడం ద్వారా భక్తి, సేవ, మానవతా విలువలను ఒకే వేదికపై చాటిన కార్యక్రమంగా ఈ సేవా కార్యక్రమం నిలిచిందన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో, భక్తుల ఆదరాభిమానాలతో సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. సేవలను స్వీకరించిన పలువురు భక్తులు టిడబ్ల్యూజేఎఫ్ నాయకత్వాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు షేక్ జానీపాష, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, సయ్యద్ అంజద్, పత్తి శ్రీనివాస్, నాయకులు వి. రోశిరెడ్డి, ఏ. మురళి, బి.రవి, ఖమ్మం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

