ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ చీరాల పట్టణ అధ్యక్షులు యాతం మేరి బాబు
చీరాల, సెప్టెంబర్ 23, (పెన్ పవర్ ) :
చీరాల నియోజకవర్గ పరిధిలో, ముఖ్యంగా చీరాల పురపాలక సంఘంలో నిబంధనలకు విరుద్ధంగా శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్న అధికారులు, అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ చీరాల పట్టణ అధ్యక్షులు యాతం మేరి బాబు ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాతం మేరి బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు, ప్రోటోకాల్‌ను పాటించకుండా మాజీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో ప్రస్తుతం ఎలాంటి పదవులు లేని వ్యక్తుల పేర్లతో శిలాఫలకాలు ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు. మున్సిపల్ చట్టం, సంబంధిత మార్గదర్శకాలను పాటిస్తూ శిలాఫలకాల ఏర్పాటులో పారదర్శకత ఉండాలని కోరారు. అధికారులు నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఆయన చేశారు. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన శిలాఫలకాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వాటిని తొలగించాలని ఆర్డీఓను కోరినట్లు తెలిపారు. అలాగే మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్ల పేర్లతో పాటు ఇతర హోదాలను ప్రస్తావిస్తూ శిలాఫలకాల ఏర్పాటు విషయంలో నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం, చట్టం, ప్రభుత్వ ప్రోటోకాల్‌కు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని కోరారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలిన అధికారులు, నాయకులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుంటూరు ప్రభాకర్‌రావు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు చెల్లి బాబురావు, కంచర్ల చక్రవర్తి, సోషల్ మీడియా కార్యదర్శి సల్లూరి నవీన్, సీనియర్ నాయకులు తొట్టెంపూడి ఇన్నయ్య, బొల్లాపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

