రోడ్డు ప్రమాద ఎస్ఐకి తీవ్ర గాయాలు*
గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించిన తుంబూరు దయాకర్ రెడ్డి
ఖమ్మం, పెన్ పవర్, సెప్టెంబర్ 24:
వినాయక నిమజ్జనం సందర్భంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో తిరుమలాయపాలెం ఎస్ఐ కూచిపూడి జగదీష్‌తో పాటు డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై తిరుమలాయపాలెం పరిసర ప్రాంతంలోని భవాని హోటల్ సమీపంలో చోటుచేసుకుంది. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసు వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ఎస్ఐ జగదీష్, ప్రైవేట్ డ్రైవర్ రాకేష్ గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఖమ్మం పట్టణంలోని స్తంభాద్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ఐ జగదీష్‌కు గాయాలు కాగా, డ్రైవర్ రాకేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, స్తంభాద్రి ఆసుపత్రికి చేరుకుని ఎస్ఐ జగదీష్, డ్రైవర్ రాకేష్‌లను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని కోరారు. ముఖ్యంగా డ్రైవర్ రాకేష్ పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న తుంబూరు దయాకర్ రెడ్డి, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఉన్నత స్థాయి ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాకేష్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తామని తెలిపారు.

