చీరాల, సెప్టెంబర్ 24, (పెన్ పవర్):
వేటపాలెం మండలం, చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని కొణిజేటి చేనేతపురి కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని టీడీపీ నాయకులు గురువారం పరామర్శించారు.
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, ఆదేశాల మేరకు చల్లారెడ్డిపాలెం పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కీర్తి పూర్ణచంద్రరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రమాదంలో జరిగిన నష్టాన్ని వివరంగా తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తరఫున బాధిత కుటుంబానికి రూ.10 వేల నగదు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కీర్తి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. ప్రమాదం ఏ కారణంతో జరిగినా నిరుపేద కుటుంబం నష్టపోవడం బాధాకరమన్నారు. ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే స్పందించి, సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులోనూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, చేనేతపురి కాలనీ గ్రామస్తులు, చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని పలువురు నాయకులు పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.

