పౌష్టికాహారంతో పిల్లలు, తల్లుల్లో ఆరోగ్యం–శక్తి పెంపు
వేటపాలెం, సెప్టెంబర్ 30: వేటపాలెం ఐసీడీఎస్ ప్రాజెక్టు దేశాయిపేట సెక్టార్ పరిధిలోని కేపాల్ కాలనీ, విజయనగర్ కాలనీలలో పోషణ మాస ఉత్సవాల్లో భాగంగా అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సెక్టార్ సూపర్వైజర్ సజ్జా లీలావతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహార రకాలు, వాటిని పిల్లలు, తల్లులు ఎంత మోతాదులో తీసుకోవాలి, వాటి ద్వారా లభించే పోషక విలువలు, శరీరానికి అందే శక్తి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, తల్లుల ఆరోగ్య పరిరక్షణకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని అంగన్వాడీ ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు లక్ష్మి, సుజాత, సుబ్బయమ్మ, హెల్పర్లు పద్మావతి, జానీకమ్మతో పాటు గ్రామ పెద్దలు, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.

