యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 21:
కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యువజన కాంగ్రెస్ నాయకులు కీలక పాత్ర పోషించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సూచించారు. యువతలో రాజకీయ చైతన్యం పెంపొందిస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన గుర్రం రాకేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన బానోత్ సాయి తుంబూరు దయాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. యువజన కాంగ్రెస్లో కొత్త బాధ్యతలు చేపట్టడం యువ నాయకులకు మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు. యువతను పెద్ద సంఖ్యలో పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ, విద్యార్థులు, నిరుద్యోగులు, యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను సంబంధిత నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో యువ నాయకులు ముందుండాలని తెలిపారు. ఈ సందర్భంగా నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం రాకేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బానోత్ సాయి మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశయాలకు అనుగుణంగా, పార్టీ నాయకుల సహకారంతో యువజన కాంగ్రెస్ను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. యువతను ఏకతాటిపైకి తీసుకొచ్చి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు అజ్మీరా అశోక్ నాయక్, ఏదులాపురం మున్సిపాలిటీ బీసీ సెల్ అధ్యక్షుడు వెంపటి రవి, 30వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు కొట్టం రంజిత్ రెడ్డి, యర్ర శేఖర్ రెడ్డి, గంగారపు యాదగిరి, యువజన నాయకులు బోయిన సాయి, ఏపూరి తరుణ్, భద్రాచారి, శివ, వడ్లకొండ భుజంగరావు, సాయి కార్తీక్, ఏపూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

