యూటీఎఫ్ గంగవరం మండల శాఖ వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
గంగవరం: స్థానిక సంస్థల ఎన్నికల విధులకు దూర ప్రాంతాలకు వెళ్లే ఉపాధ్యాయులు, ఇతర ఎన్నికల సిబ్బంది ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ గంగవరం మండల శాఖ చేసిన విజ్ఞప్తికి జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సానుకూలంగా స్పందించారు.
పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ గంగవరం మండల పర్యటనకు వచ్చిన సందర్భంగా యూటీఎఫ్ మండల శాఖ నాయకులు సిహెచ్. వెంకటేశ్వరరావు, శారపు వెంకటేశులు దొర, సిహెచ్. రాంబాబు దొర ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. గంగవరం మండలానికి చెందిన పలువురు ఉపాధ్యాయులకు ఎటపాక, వి.ఆర్.పురం, చింతూరు, కూనవరం, గుర్తేడు తదితర దూర ప్రాంతాల్లో ఎన్నికల విధులు కేటాయించిన నేపథ్యంలో సకాలంలో విధులకు హాజరయ్యేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.
ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బంది ఎదుర్కొనే ప్రయాణ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ కేంద్రాల నుంచి ప్రత్యేక ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
యూటీఎఫ్ నాయకుల వినతిపై స్పందించిన కలెక్టర్ నవంబర్ 4వ తేదీ ఉదయం 5 గంటలకు రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ కార్యాలయాల నుంచి ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బంది కోసం ప్రత్యేక ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి రవాణా సదుపాయం కల్పించడం పట్ల యూటీఎఫ్ గంగవరం మండల శాఖ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులు, ఎన్నికల సిబ్బంది సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్కు యూటీఎఫ్ మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

