మాల ధరించాడని విద్యార్థికి తరగతి గదిలోకి నో ఎంట్రీ
నాచారం సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ ఎదుట అయ్యప్ప స్వాముల ఆందోళన
గతంలోనూ రెండుసార్లు ఇదే ఘటన.. బీజేపీ నాయకుడు రాగిరి మోహన్ రెడ్డి
ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కావని పాఠశాల యాజమాన్యం లిఖితపూర్వక హామీ
కాప్రా, పెన్ పవర్, నవంబర్ 17:
అయ్యప్ప మాల ధరించాడనే కారణంతో తొమ్మిదో తరగతి విద్యార్థిని తరగతి గదిలోకి అనుమతించకుండా లైబ్రరీలో, మరో గదిలో కూర్చోబెట్టిన ఘటన నాచారంలోని సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. గతంలోనూ ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ పాఠశాల యాజమాన్యం తీరు మారకపోవడంపై అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాల యాజమాన్యం వ్యవహారశైలితో మనస్తాపానికి గురైన విద్యార్థి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు అయ్యప్ప స్వాముల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాఠశాల ఎదుటకు చేరుకుని నిరసన చేపట్టారు. మాల ధరించడం వల్ల విద్యార్థిని తరగతి గదిలోకి అనుమతించకపోవడం ఏమిటని యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు రాగిరి మోహన్ రెడ్డి, మాట్లాడుతూ.. ఇదే పాఠశాలలో గతంలోనూ రెండుసార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, అప్పట్లో నిరసనలు తెలిపినా యాజమాన్యం వైఖరిలో మార్పు రాకపోవడం బాధాకరమని అన్నారు. విద్యార్థుల మత విశ్వాసాలను గౌరవించాలని, మాల ధరించాడనే కారణంతో విద్యార్థి చదువుకు ఆటంకం కలిగించడం సరికాదని పేర్కొన్నారు.
పాఠశాల కరస్పాండెంట్ విద్యా స్రవంతి వివరణ
ఈ ఘటనపై సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ విద్యా స్రవంతి లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. పాఠశాలలో విద్యార్థుల పట్ల ఎలాంటి వివక్ష చూపబోమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థుల అవసరాల పట్ల పాఠశాల ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్న విద్యార్థుల పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, విద్యార్థులందరినీ సమాన శ్రద్ధతో చూసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత అభ్యర్థన మేరకు తమ పూర్తి సహకారం ఉంటుందని లిఖితపూర్వకంగా భరోసా ఇచ్చారు.
విద్యాసంస్థల్లో విద్యార్థుల మధ్య ఎలాంటి వివక్షకు తావులేకుండా, ప్రతి ఒక్కరి మత విశ్వాసాలు, ఆచార సంప్రదాయాలు, మనోభావాలను గౌరవిస్తూ విద్యాబోధన సాగించాలని అయ్యప్ప స్వాములు మామిడాల సంతోష్ రెడ్డి,తో డిమాండ్ చేశారు.

