ప్రజా సేవలకు గుర్తింపుగా బొజ్జ యాదగిరికి డాక్టరేట్
రవీంద్రభారతిలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రదానం
కాప్రా, పెన్ పవర్ నవంబర్ 16:
దళిత జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, దళిత రత్న అవార్డు గ్రహీత బొజ్జ యాదగిరి అందిస్తున్న ప్రజాసేవలను గుర్తిస్తూ శ్రీ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా బొజ్జ యాదగిరి ఈ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బొజ్జ యాదగిరి చేస్తున్న ప్రజాసేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతూ, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తి యాదగిరి అని కొనియాడారు. ఆయనకు ఇంతటి గౌరవ డాక్టరేట్ లభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా బొజ్జ యాదగిరి అన్న పిలుపు మేరకే తాను ఈ కార్యక్రమానికి హాజరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. యాదగిరి తనకు అత్యంత ఆప్తుడని, కల్మషం లేని వ్యక్తి అని సభా వేదికగా తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ప్రగతి ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్ రాజుతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

