4 లక్షల విలువైన 20 మొబైల్ ఫోన్లు స్వాధీనం.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
చీరాల, నవంబర్ 17: సెల్ఫోన్ల చోరీ కేసును ఈపురుపాలెం పోలీసులు సమర్థవంతంగా ఛేదించారు. వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన 20 మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు.
ఈ కేసులో బాపట్ల జిల్లా అడవిపల్లిపాలెం గ్రామానికి చెందిన చిన్నా అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 14 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా, మరో ఆరు ఫోన్లను గుర్తించి మొత్తం 20 ఫోన్లను రికవరీ చేశారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఈపురుపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పక్కా సమాచారంతో దర్యాప్తు చేపట్టడం ద్వారా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన గ్రామీణ సీఐ సుధాకర్, ఎస్సై రామాంజనేయులు, పోలీసు సిబ్బంది రాజేష్, నరసింహారెడ్డి, ప్రశాంత్, నాగ ఆంజనేయులును జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీ ఎం.డి. మోయిన్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. మొబైల్ ఫోన్లను అప్రమత్తంగా భద్రపరుచుకోవాలని, ఫోన్ చోరీకి గురైనా లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నా ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు.

