Homeఆంధ్రప్రదేశ్కాకినాడకాజులూరు మండలంలో హోరాహోరీగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

కాజులూరు మండలంలో హోరాహోరీగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

రెండు రోజుల్లో 322 నామినేషన్లు దాఖలు..

శలపాకలో టేకుమూడి భాగ్యలక్ష్మి, తణుకువాడలో పితాని పద్మావతి బరిలోకి

కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 19: గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కాజులూరు మండలంలో రాజకీయ వేడిని రాజేస్తోంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది. మండలంలోని 26 గ్రామపంచాయతీల పరిధిలో రెండు రోజులుగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. రెండో రోజు నామినేషన్ల సంఖ్య భారీగా పెరగడంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది.

నవంబర్ 18న మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 18, వార్డు సభ్యుల స్థానాలకు 52 నామినేషన్లు దాఖలయ్యాయి. నవంబర్ 19న రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 46, వార్డు సభ్యుల స్థానాలకు 206 నామినేషన్లు వచ్చాయి. దీంతో రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 64, వార్డు సభ్యుల స్థానాలకు 258 చొప్పున మొత్తం 322 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో జె. రాంబాబు వెల్లడించారు.

ముఖ్యంగా శలపాక గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టేకుమూడి భాగ్యలక్ష్మి శంకర్, తణుకువాడ సర్పంచ్ అభ్యర్థిగా పితాని పద్మావతి, గొల్లపాలెం సర్పంచ్ అభ్యర్థిగా అంగర శ్రీను, బంధనపూడి సర్పంచ్ అభ్యర్థిగా మోకన వాడపల్లి నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

**శలపాకలో హోరాహోరీ ద్విముఖ పోరు**

శలపాక గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో పోటీ రసవత్తరంగా మారింది. కూటమి మద్దతుదారుగా ప్రచారంలో ఉన్న మాజీ సర్పంచ్ పోతుల గనిరాజు భార్య శ్రీలక్ష్మి, టేకుమూడి భాగ్యలక్ష్మి మధ్య ప్రధాన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉండనుందని స్థానిక రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో గ్రామంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

**తణుకువాడలో బంధువుల మధ్య రాజకీయ సమరం**

తణుకువాడ గ్రామంలోనూ సర్పంచ్ పదవికి ద్విముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు దగ్గరి బంధువులే కావడం విశేషం. ఒకే సామాజిక వర్గానికి చెందినప్పటికీ రాజకీయ పోటీలో మాత్రం ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాయుడు లీలా శంకర్ గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందగా, ఈసారి తన భార్య పితాని పద్మావతిని సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దింపారు. తన మేనల్లుడి భార్యతోనే ఆమె తలపడుతుండటంతో గ్రామంలో ఈ పోరు చర్చనీయాంశంగా మారింది. బంధుత్వాలు ఒకవైపు, రాజకీయ ఆధిపత్య పోరు మరోవైపు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది.

మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులతో పాటు వార్డు సభ్యుల స్థానాల్లోనూ పోటీ తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అభ్యర్థులు తమ మద్దతుదారులను కూడగట్టుకుంటూ, ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు పార్టీల గుర్తులపై ఎన్నికలు జరగకపోయినా కొందరు అభ్యర్థులు రాజకీయ పార్టీల కండువాలు ధరించి ప్రచారం నిర్వహిస్తుండటం గ్రామాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

రెండు రోజుల్లోనే 322 నామినేషన్లు దాఖలు కావడంతో కాజులూరు మండలంలో పల్లె రాజకీయాలు మరింత వేడెక్కాయి. ముఖ్యంగా శలపాక, తణుకువాడ గ్రామాల్లో నెలకొన్న పోటీపై స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది. చివరకు ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలుసుకోవాలంటే నవంబర్ 29 వరకు వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular