అక్రమ నిర్మాణాలపై ఎంఎంసీ ఉక్కుపాదం
కాప్రా డీసీ ఆదేశాలతో అక్రమ కట్టడాల కూల్చివేత
తిరిగి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు
కాప్రా, పెన్ పవర్, నవంబర్ 20:
అక్రమ నిర్మాణాలపై మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) అధికారులు చర్యలు చేపట్టారు. నాచారం సర్కిల్ పరిధిలోని నాగార్జున నగర్ కాలనీ, రోడ్ నంబర్ 3లో సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవనంపై ఎలాంటి అనుమతులు లేకుండా అదనంగా చేపట్టిన రెండు అంతస్తుల నిర్మాణాన్ని శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు.
అక్రమ నిర్మాణంపై అందిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న కాప్రా డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగి కూల్చివేత చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు, పెంట్‌హౌస్‌లు నిర్మించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు.
కూల్చివేసిన భవనంలో తిరిగి ఎలాంటి అక్రమ నిర్మాణ పనులు చేపట్టినా, పునర్నిర్మాణం పేరుతో నిబంధనలకు విరుద్ధంగా పనులు ప్రారంభించినా సంబంధిత యజమానులపై చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. భవన యజమానులు, బిల్డర్లు నిర్మాణాలకు ముందుగా తప్పనిసరిగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని సూచించారు.
అధికారుల హెచ్చరికలను తేలికగా తీసుకోకుండా మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టాలని కాప్రా డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్ స్పష్టం చేశారు.

