- బరిలో యాళ్ళ వెంకట రమణ, వట్టూరి పట్టాభిరామయ్య
కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 20:
కాజులూరు మండలంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియలో సర్పంచ్ స్థానాలకు 122, వార్డు సభ్యుల స్థానాలకు 561 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీవో జె.రాంబాబు తెలిపారు.ఇదిలా ఉండగా మండల కేంద్రం కాజులూరు గ్రామ సర్పంచ్ స్థానానికి యాళ్ళ వెంకట రమణ, వట్టూరి పట్టాభిరామయ్య శుక్రవారం చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడంతో గ్రామంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇద్దరు అభ్యర్థులు తమదైన నేపథ్యంతో ఎన్నికల బరిలో నిలిచారు. యాళ్ళ వెంకట రమణ గతంలో సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి కాగా, వట్టూరి పట్టాభిరామయ్య ప్రముఖ వ్యాపారవేత్తగా, రైతాంగంతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
పట్టాభిరామయ్యకు గతంలో రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తొలిసారిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలవడంతో కాజులూరు గ్రామ సర్పంచ్ ఎన్నికపై గ్రామస్థుల్లో ఆసక్తి నెలకొంది.


