Homeఆంధ్రప్రదేశ్కాకినాడఆర్యవటంలో హోరాహోరీ పోరు యువత రాజకీయ అరంగేట్రం..

ఆర్యవటంలో హోరాహోరీ పోరు యువత రాజకీయ అరంగేట్రం..

సర్పంచ్ పీఠంపై కన్ను!
బాబి వర్సెస్ అజయ్ కృష్ణ.. ప్రచారంలో హోరెత్తుతున్న రాజకీయ వేడి
కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 26:కాజులూరు మండల పరిధిలోని ఆర్యవటం గ్రామ పంచాయతీ ఎన్నికలు రోజురోజుకూ ఉత్కంఠ రేపుతున్నాయి. సర్పంచ్ పీఠాన్ని దక్కించుకునేందుకు యువ అభ్యర్థులు వ్యూహప్రతివ్యూహాలతో ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. గ్రామంలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం యువ నాయకులు చందాల వీరవెంకట సత్యనారాయణ (బాబి), వనుం అజయ్ కృష్ణ మధ్యే నెలకొంది. ఇద్దరూ యువకులే కావడంతో ఈ ఎన్నికలు గ్రామ రాజకీయాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


కూటమి అండతో బాబి దూకుడు!
చందాల వీరవెంకట సత్యనారాయణ అలియాస్ బాబి న్యాయవాదిగా కొనసాగుతున్నారు. మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం అండదండలతో కూటమి మద్దతుతో ఎన్నికల బరిలో దిగిన ఆయన కత్తెర గుర్తుపై ఓటు వేయాలని ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామాభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని, తనకు అవకాశం కల్పిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. కూటమి బలంతో పాటు యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తానంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ అనుభవమే అజయ్ కృష్ణకు అండ!
మరోవైపు మాజీ సర్పంచ్, మాజీ జెడ్పీటీసీ వనుం వెంకటసుబ్బారావు తనయుడు వనుం అజయ్ కృష్ణ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నారు. రాజకీయంగా గ్రామంలో మంచి పట్టున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు తండ్రి చేసిన సేవలు, కుటుంబానికి ఉన్న ప్రజా పరిచయాలు కలిసివస్తాయని ఆశిస్తున్నారు. విద్యావంతుడైన యువకుడిగా గ్రామాభివృద్ధికి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తానని చెబుతూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
యువ నాయకత్వానికి పట్టం ఎవరికో?
ఇద్దరు యువ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తుండటంతో ఆర్యవటంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకవైపు కూటమి అండ, మరోవైపు రాజకీయ అనుభవం కలిగిన కుటుంబ నేపథ్యం.. ఈ రెండు అంశాలు ఎన్నికల పోరును ఆసక్తికరంగా మార్చాయి. ఇంటింటి ప్రచారాలు, ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలతో గ్రామంలో ఎన్నికల సందడి పతాక స్థాయికి చేరింది. యువతకు నాయకత్వ అవకాశం ఇవ్వాలనే నినాదం ఒకవైపు వినిపిస్తుండగా, అనుభవం, కుటుంబ సేవలు మరోవైపు చర్చనీయాంశంగా మారాయి.


మరి ఆర్యవటం ఓటర్లు కొత్తతరం నాయకత్వానికి జై కొడతారా? రాజకీయ అనుభవం ఉన్న కుటుంబ వారసుడికి పట్టం కడతారా? ఇద్దరు యువ నాయకుల్లో సర్పంచ్ పీఠాన్ని అధిరోహించేది ఎవరు? అన్న ఉత్కంఠకు నవంబర్ 29న ఓటర్లు తమ ఓటుతో సమాధానం చెప్పనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular