📰 Generate e-Paper Clip
దాఖలైన రెండు పిటిషన్లను కలిపి విచారించనున్న హైకోర్టు..
బహుదూర్‌పల్లి 227 సర్వే నెంబర్‌పై ఈనెల 20న హైకోర్టులో విచారణ..
ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు జారీ.. కౌంటర్ దాఖలుకు సిద్దమైన ప్రభుత్వం..?
ఈ కేసులో ఇంప్లీడ్ అయిన బహుదూర్‌పల్లి మాజీ సర్పంచ్ శివునూరి సుజాత..
సాయినాథ్ సొసైటీ, రెడ్డిస్ బయో సైన్సెస్ సంస్థలు, విడివిడిగా పిటిషన్లు దాఖలు..
22-ఏ నిషేధిత జాబితా నుంచి సర్వే నెం.227 తొలగించాలన్న పిటిషనర్లు..!
విచారణకు స్వీకరించిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం..
నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపుకు రెడ్డీస్ బయో సైన్సెస్ అభ్యర్ధన.
రెడ్డీస్ సంస్థకు ఊరట కల్పించిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం..
రెడ్డీస్ సంస్థకిచ్చిన ఉత్తర్వుల ఆధారంగా హైకోర్టును ఆశ్రయించిన సాయినాథ్ సొసైటీ..
సాయినాథ్ సొసైటీకి కూడా అదే తరహా ఉత్తర్వులు వర్తిస్తాయన్న హైకోర్టు..
తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు అనుమతిచ్చిన హైకోర్టు..తుది విచారణతో రానున్న స్పష్టత..
వేలకోట్లు విలువైన సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంలో, రెవెన్యూ అధికారుల ద్వంద వైఖరి, అక్రమార్కులకు అనుకూలంగా తయారైందా..? లేక అధికారులు చేసిన ధరణి అక్రమ రిజిస్ట్రేషన్లు ఎటువైపు తీసుకెళ్తుందదో చూడాలి..? ఒకవైపు వక్రమార్గంలో ధరణి రిజిస్ట్రేషన్లు చేసిన అదే జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి, 353.35 ఎకరాలు ప్రభుత్వ భూమిగా తీర్పును వెలువరించారు.. అనంతరం అదే తీర్పును సవాల్ చేసి హైకోర్టుకు వెళ్ళిన పిటిషనర్లు.. తాత్కాలికంగా సంబంధిత తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది.. ఇప్పుడు ఆ స్టే ఆధారంగా 22-ఎ జాబితా నుంచి తొలగింపుకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూనే ఈనెల 20కి విచారణను కోర్టు వాయిదా వేసింది..
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, మార్చి 8:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ-దుండిగల్ మండలం బహుదూర్‌పల్లి గ్రామ శివారు సర్వే నెం.227 ప్రభుత్వ భూమి సుమారు రూ.30-40 వేలకోట్లు విలువైన 353.35 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం రోజురోజుకు కీలక మలుపు తిరుగుతోంది..ఈనెల (20 మార్చి 2026న) భవితవ్యం తేలనున్నది.. 22-ఏ నిషేధిత జాబితా నుండి తొలగించాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని రెండు పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు విచారణ ఈనెల 20కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.. ఒకవైపు రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరితోనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందనే ఆరోపణలు లేకపోలేదు.. మరోవైపు కేసు హైకోర్టు పరిధిలో ఉండగానే అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న సాయినాథ్ సొసైటీ అధ్యక్షుడు, సభ్యుల వ్యవహారం తెలిసిందే..! ఇప్పుడు 22-ఎ నుంచి బహుదూర్‌పల్లి సర్వే నెం. 227 ప్రభుత్వ భూమి 353.35 ని తొలగింపు పిటిషన్‌కి మధ్యంతర ఉత్తర్వులు.. ఈ 15 రోజులపాటు తొలగిస్తారని, ఆ వ్యవధిలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని సభ్యులతో ముందస్తు ప్రచారం జోరుగా సాగుతున్నట్టు ఓ సభ్యుడు “పెన్ పవర్” ప్రతినిధికి ఫోన్ కాల్‌తో స్పష్టత.. ఇప్పటికే 2022 నుండి 2023 అక్టోబర్11 వరకు ధరణీ చట్టంలోని “నోషనల్ ఖాతా” పేరుతో దాదాపు 200 ఎకరాలకు పలువురి పేరుమీద దుండిగల్ గండిమైసమ్మ మండలంలో ధరణి రిజిస్ట్రేషన్లు చేసిన విషయం తెలిసిందే..! ఈ వ్యవహారంలో సీసీఎల్ఏ కమిషనర్ అండ్ మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, దుండిగల్ తహశీల్దారుల పర్యవేక్షణలోనే అక్రమ ధరణీ రిజిస్ట్రేషన్లు చర్చనీయాంశంగా మారింది..?ఆ తప్పుడు ధరణి రిజిస్ట్రేషన్లే ఈ కబ్జాలకు బలం చేకూర్చబోతుందా..? ధరణి చట్టంలో పరిపాలనా ఎంట్రీలో భాగమైన “నోషనల్ ఖాతా”తో ధరణి రిజిస్ట్రేషన్లు చేయొచ్చా..? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.. మరోవైపు రెండు పిటిషన్లకు కలిపి, ఈనెల 20న హైకోర్టు విచారణ వాయిదా ఉన్న నేపథ్యంలో బహుదూర్‌పల్లి సర్వే నెం.227 భవితవ్యం తేలనున్నది.. 22-ఎ నిషేధిత జాబితా నుండి పూర్తిగా తొలగిస్తారా..? లేక అదే జాబితాలో కొనసాగుతుందా..? అనే విషయంపై ఉత్కంఠతో పలువురు ఎదురు చూస్తున్నారు..
25 ఏళ్ళ క్రితమే మొదలైన కేసు..!
2000 సంవత్సరంలో రెవెన్యూ ‘ఎన్వోసి’కి వెళ్ళగా..! అదే విషయాన్ని అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ “సీసీఎల్ఏ” కమిషనర్‌కు ప్రతిపాదన పంపించారు.. సంబంధిత భూమి ప్రభుత్వ పోరంబోకు భూమిగా రికార్డులు ఉండటంతో తిరస్కరించారు.. వెంటనే హైకోర్టుకు వెళ్ళగా 2004 హైకోర్టు ఆదేశాల మేరకు, అదే రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుదీర్ఘ విచారణ అనంతరం 2009లో జగన్మోహన్ రావు ఐఏఎస్ ప్రభుత్వ భూమిగానే ప్రొసీడింగ్ జారీచేశారు.. 2022లో హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ..! నాడు సాయినాథ్ సొసైటీ “ఎన్వోసి” తిరస్కరించిన అదే “సీసీఎల్ఏ” కమిషనర్, మరో ఇద్దరు మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, ఇద్దరు తహశీల్దార్లు, ధరణి చట్టంలోని “నోషనల్ ఖాతా” పేరుతో “2022-2023 అక్టోబర్” వరకు ఇండ్ల ప్లాట్లుగా ఉన్న దాదాపు 200 ఎకరాలను..రెడ్డిస్ బయో సైన్సెస్ సంస్థ తోపాటు, పలువురికి వ్యవసాయ భూమిగా ధరణి రిజిస్ట్రేషన్లు చేశారు.. పట్టా పాసు బుక్కులు, జారీచేశారు.. మళ్ళీ రెండు నెలల వ్యవధిలోనే, అదే భూమిని సుమారు రూ.6 కోట్లు చెల్లించి నాలా కన్వర్శన్ (వ్యవసాయేతర భూమిగా) చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది..?
వక్రమార్గంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ..?
ఇదిలా ఉండగానే సాయినాథ్ సొసైటీ రంగంలోకి దిగింది.. సొసైటీ అధ్యక్షుడి హోదాలో ప్రభుత్వ భూమిని 2024 జనవరి 8న 5 ప్లాట్లు మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించారు.. అయితే కారణం ఏదైనా..! ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు పెద్దగా జోక్యం చేసుకోలేదు.. ఎందుకంటే హైకోర్టులో ఉండగానే “2022-2023″లో ధరణి రిజిస్ట్రేషన్లు చేసిన ఘనత రెవెన్యూ యంత్రాంగానికే దక్కుతుంది.. అక్రమ రిజిస్ట్రేషన్లే అయినప్పటికీ..! సాయినాథ్ సొసైటీని ప్రశ్నించలేక పోయిందని, ఆరోపణలు వచ్చాయి.. కానీ ‘పెన్ పవర్’ దినపత్రికలో వస్తున్న వరుస కథనాలకు ఇక తప్పదు అనుకున్నారు కాబోలు..! 2024 జూన్ 28న అప్పటి తహశీల్దార్ మతీన్ కలెక్టర్ ఆదేశాలతో, రిజిస్ట్రేషన్లు నిలిపి వేయాలని, మేడ్చల్ రిజిస్టార్కు ఓ లేఖను రాశారు.. లేఖలో 227 ప్రభుత్వ పోరంబోకు భూమిగా తేలుస్తూ పూర్తి వివరాలు పేర్కొన్నారు.. అయినా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ యధావిధిగా నిరంతర ప్రక్రియగా మారింది..
ఇంతలోనే సాయినాథ్ సొసైటీ, మరో అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది.. దీంతో 2004 నాటి హైకోర్టు ఆదేశాలను, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏకపక్షంగా తీర్పును వెలువరించారని, నాటి హైకోర్టు ఉత్తర్వులను పునః పరిశీలించాలని 2024 అక్టోబర్ 30న మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌ను ఆదేశించింది.. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో సంవత్సరం పాటు ఇరు వర్గాలను పలు వాయిదాలతో డాక్యుమెంట్లను పరిశీలించారు.. చివరికి సర్వే నెం. 227 లో మొత్తం 353.35 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమిగా నిర్ధారించి, స్పష్టమైన ఆధారాలతో వెల్లడించారు.. అదనపు కలెక్టర్ విచారణలో బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమి 353.35 ఎకరాలు విక్రయించిన వారికి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే 1966లో క్రయవిక్రయాలు జరిగాయని 1948 నుండి ప్రభుత్వ పోరంబోకు భూమిగానే అదనపు కలెక్టర్ నిర్ధారించారు..