విశ్వశాంతి విద్యాలయంలో భక్తి పారవశ్యం
విద్యార్థులతో కళకళలాడిన పాఠశాల ప్రాంగణం
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 7:
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, అమ్మవారి భక్తి సంప్రదాయానికి నిదర్శనంగా నిలిచిన బోనాల పండుగను పురస్కరించుకుని గార్ల మండల కేంద్రంలోని స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో శుక్రవారం ముందస్తు బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యాలయం ఆవరణ అంతా పండుగ శోభతో కళకళలాడగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని భక్తి భావాన్ని చాటి చెప్పారు.ఈ కార్యక్రమానికి విద్యాలయ కరస్పాండెంట్ వడ్లమూడి దుర్గాప్రసాద్, బీరవెల్లి సంజీవరెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించి, సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించి పాలకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి విశ్వాసాలకు ప్రతీక అని ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను పెంపొందించే గొప్ప వేడుకని విద్యార్థులు చిన్నప్పటి నుంచే మన పండుగల విశిష్టతను తెలుసుకొని,సంస్కృతి–సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అనంతరం విద్యార్థులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయ దుస్తులు ధరించి బోనాల ఎత్తుకొని దేవతమూర్తుల పాటలకు, నృత్యాలు వేశారు విద్యాలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండిపోయింది.ఈ కార్యక్రమంలో విశ్వశాంతి విద్యాలయ ప్రిన్సిపల్ రమేష్, ఉపాధ్యాయ, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

