గార్ల, పెన్ పవర్, ఆగస్టు 7:
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం ఎదురుచూస్తున్నారని, ముఖ్యంగా మూడో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని TEGA (తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం) రాష్ట్ర కార్యదర్శి గంగావత్ శ్రీనివాస్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, లక్షన్నర మందికి పైగా ఉపాధ్యాయులు, లక్షలాది మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు, విద్య, వైద్యం, శాంతిభద్రతలు, పరిపాలన వంటి అన్ని రంగాల్లో వారి సేవలు అమూల్యమైనవని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు, మెరుగైన సేవా సౌకర్యాలు కల్పిస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మొదట 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిందని, అనంతరం తొలి పీఆర్సీ సిఫార్సుల మేరకు సుమారు 30 శాతం ఫిట్మెంట్ అమలు చేసిందన్నారు. అయితే రెండో పీఆర్సీ అంశం పూర్తిగా పరిష్కారం కాకముందే మూడో పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం స్పందించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోందని తెలిపారు.ఉద్యోగుల వేతన సవరణ, డీఏ బకాయిలు, పదోన్నతులు, ఖాళీ పోస్టుల భర్తీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకలుగా నిలుస్తున్న నేపథ్యంలో వారి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే మూడో పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి, ఉద్యోగులకు న్యాయం చేయాలని గంగావత్ శ్రీనివాస్ నాయక్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

