నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం – అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం
కాజులూరు, పెన్ పవర్, మార్చి 28:
మండల పరిధిలోని కూరాడ కెనాల్, మేజర్ డ్రైయిన్లో దట్టంగా పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటు మరియు చెత్తాచెదారం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కాలువల్లో నీటి ప్రవాహం సక్రమంగా సాగకపోవడంతో దిగువ ప్రాంతాల పంటపొలాలకు సాగునీరు చేరక రైతులు ఆందోళన చెందుతున్నారు.స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం,ఉప్పు టేరు వరకు గుర్రపు డెక్క విస్తరించి నీటి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటోంది. ఫలితంగా నీరు సకాలంలో కిందికి వెళ్లక కాలువలు నిల్వ నీటితో నిండిపోతున్నాయి. ముఖ్యంగా వరి సాగుపై ఆధారపడిన రైతులకు ఇది పెద్ద సమస్యగా మారింది.రైతులు ఆరోపిస్తున్న దాని ప్రకారం, సంబంధిత డ్రైయిన్, ఇరిగేషన్ అధికారులు కాలువల శుభ్రపరిచే పనులను కేవలం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారే తప్ప,శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించడం లేదని మండిపడుతున్నారు.ప్రతి సంవత్సరం లక్షల రూపాయల ఖర్చు చూపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం వేసవి కాలంలోనే కాలువలు ఇంత దయనీయ స్థితిలో ఉండగా, రానున్న వర్షాకాలం మరియు తొలకరి పంట సీజన్లో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. చిన్నపాటి వర్షాలు కురిసినా కాలువలు ఎగబెడతాయన్న భయం రైతుల్లో నెలకొంది.మరియు పలు చోట్ల పంట కాలువలకు మరమ్మతులు లేక శిధిలావస్థకు చేరుకున్నాయి. నీటి లాకులు, గేట్లు గండ్లు పడి, పొలాలకు చేరాల్సిన నీరు వృథాగా పోతున్నదని రైతులు వాపోతున్నారు.
మొగలిపాలెం, డేగలపేట, శలపాక, మంజేరు ప్రాంతాల రైతులు మాట్లాడుతూ,“ఇప్పటికైనా అధికారులు కూరాడ డ్రైయిన్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటును పూర్తిగా తొలగించి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలి.లేకపోతే వర్షాకాలంలో మరోసారి ముంపు తప్పదు” అని హెచ్చరించారు.అలాగే మంజేరు తనియేలు వద్ద కూరుకుపోయిన ఊబును కూడా ఈ వేసవిలోనే తొలగిస్తే తొలకరి పంటలకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సాగునీటి వనరులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ నేపథ్యంలో, రైతాంగాన్ని ఆదుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


