తప్పుడు ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నారంటూ మేట్‌పై గ్రామస్తుల ఆరోపణలు
పుల్లల చెరువు పెన్ పవర్ మే 12
పుల్లలచెరువు మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కూలీలకు మేట్‌గా వ్యవహరిస్తున్న ఖాసీంవలి అనే వ్యక్తి, పనికి రాని వారి ఫోటోలను కూడా ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.సోమ, మంగళవారం రోజులలో అప్‌లోడ్ చేసిన ఫోటోలను పరిశీలిస్తే, తన వద్ద ఉన్న లాగిన్‌ను దుర్వినియోగం చేస్తున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.పని గుర్తింపు సంఖ్య 100503 వద్ద హాజరైన వారి కంటే ఎక్కువ మంది ఫోటోలు అప్‌లోడ్ చేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
జాబ్ కార్డు నంబర్ 10724కు చెందిన జంగం వీరమ్మ అనే మహిళా కార్మికురాలు, మస్టర్ రోల్ నంబర్ 6122లో నమోదై ఉండగా, వ్యక్తిగత పనుల నిమిత్తం గుంటూరుకు వెళ్లినప్పటికీ మంగళవారం ఆమె ఉపాధి హామీ పనికి హాజరైనట్టుగా ఫోటోలు అప్‌లోడ్ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అలాగే జాబ్ కార్డు నంబర్ 11342, మస్టర్ రోల్ నంబర్ 6126కు చెందిన దొడ్డిపల్లి సిద్దయ్య ఉదయం నుంచే తన స్వంత షాపులో పనిచేస్తూ కనిపించినప్పటికీ, అతను కూడా ఉపాధి హామీ పనికి హాజరైనట్టుగా ఫోటోలు నమోదు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలా అనేక సందర్భాల్లో ఇదే తరహాలో ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న మేట్‌పై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు, అతనికి ఉన్న లాగిన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.రాజకీయ నాయకుల అండదండలతో ఈ వ్యవహారం కొనసాగుతోందని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.పార్టీలకు అతీతంగా ప్రతి శ్రామికుడికి ఉపాధి హామీ పనులు కల్పించాలని, కేవలం ఇద్దరు లేదా ముగ్గురికే లాగిన్‌లు ఇచ్చి అందరూ వారి వద్దకే వెళ్లి ఫోటోలు దిగే పరిస్థితి సరికాదని శ్రామికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాదిలోనే 50 మంది శ్రామికులకు ఒక మేట్‌ను ఎంపిక చేసిన నేపథ్యంలో, అర్హులైన వారికి లాగిన్‌లు మంజూరు చేసి ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

