ePaper
Thursday, April 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అయోమయంలో వైసీపీ.. చిక్కుల్లో జగన్!

అయోమయంలో వైసీపీ.. చిక్కుల్లో జగన్!

లోక్‌సభలో అమరావతికి ఏకైక రాజధానిగా చట్టబద్ధత దక్కిన కీలక సమయంలో, ‘మావిగన్’ అనే కొత్త గ్రోత్ కారిడార్ ప్రతిపాదనను ముందుకు తేవడం ద్వారా వైసీపీ మరోసారి రాజధాని అంశంలో వ్యూహాత్మక అయోమయాన్ని సృష్టించిందన్న విమర్శలు బలపడుతున్నాయి.  ఒకవైపు అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతూ, మరోవైపు పార్లమెంట్‌లో బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేయడం, ఇప్పుడు కొత్త రాజధాని సిద్ధాంతాన్ని తెరపైకి తేవడం వల్ల జగన్ రాజకీయ విశ్వసనీయతతో పాటు పార్టీ క్యాడర్‌లోనూ గందరగోళం మరింత పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  • అమరావతి బిల్లుతో వైసీపీ వ్యూహం తలకిందులా?
  • ‘మావిగన్’ ప్రతిపాదనతో కొత్త చిక్కుల్లో జగన్
  • పార్లమెంట్ వాకౌట్‌తో బయటపడిన ద్వంద్వ వైఖరి
  • క్యాడర్‌లో గందరగోళం, ప్రజల్లో విశ్వసనీయత ప్రశ్నార్థకం
  • టైమింగ్ మిస్ అయిందా? రాజకీయంగా రివర్స్ గేర్‌లో వైసీపీ

గుంటూరు, పెన్ పవర్ ఏప్రిల్ 2:

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన, కీలకమైన అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి వ్యూహాత్మక తప్పిదం చేసిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. 2019-24 మధ్య మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసి, ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకున్న తర్వాత కూడా ఆ పార్టీ తన పంథాను మార్చుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్విభజన సవరణ బిల్లు-2026 ఆమోదం పొందిన వేళ.. జగన్ మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన మావిగన్ అనే కొత్త ప్రతిపాదన ఆ పార్టీని మరింత రాజకీయ రక్షణలో పడేసింది.మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి మావిగన్ అనే గ్రోత్ కారిడార్‌ను రాజధానిగా జగన్ ప్రతిపాదించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అయితే, పార్లమెంట్ సాక్షిగా అమరావతికి శాసనపరమైన గుర్తింపు దక్కిన ఈ తరుణంలో ఇలాంటి ప్రతిపాదనలు చేయడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి ఇప్పుడు కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాదు, అది పార్లమెంట్ ఆమోదించిన చట్టం. జగన్ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా తన వ్యక్తిగత కార్యాలయాలను ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ, రాజధానిని తరలించడం అనేది ఇప్పుడు అసాధ్యమైన ప్రక్రియగా మారింది.రాజధాని విషయంలో వైసీపీ అనుసరిస్తున్న దోబూచులాట ఆ పార్టీ క్యాడర్‌ను కూడా గందరగోళానికి గురిచేస్తోంది. ఒకవైపు అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెబుతూనే, మరోవైపు పార్లమెంట్‌లో బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేయడం ద్వారా తమ ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకున్నారు. ఈ సమయంలో అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించి, కేవలం అక్కడ జరుగుతున్నట్లుగా తాము భావిస్తున్న అవినీతి పై మాత్రమే పోరాటం చేసి ఉంటే వైసీపీకి రాజకీయంగా మైలేజీ దక్కేది. కానీ, ఇప్పుడు మావిగన్ వంటి కొత్త పేర్లతో గందరగోళం సృష్టించడం వల్ల ప్రజల్లో ఆ పార్టీ విశ్వసనీయత మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.అమరావతిని స్మశానం అని, గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేసిన నేతలే, ఇప్పుడు రాజధాని హోదా కల్పించడాన్ని తప్పుపడుతున్నారు. సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వంటి వారు అన్నీ అమరావతికే చేస్తే మేము అడుక్కుతినాలా? అని చేస్తున్న వ్యాఖ్యలు ప్రాంతీయ విద్వేషాలను రేకెత్తించేలా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలను కట్టడి చేయకుండా, జగన్ కూడా అదే బాటలో ప్రయాణించడం ఆయన రాజకీయ భవిష్యత్తుకే ముప్పు తెచ్చేలా ఉంది. అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే ముద్ర ఇప్పటికే పడటంతో, మావిగన్ ప్రతిపాదన ఆ ముద్రను మరింత బలపరుస్తోంది. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. కేంద్రం అమరావతికి నిధులు ఇవ్వడమే కాకుండా చట్టబద్ధత కూడా కల్పిస్తున్నప్పుడు, దానికి క్రెడిట్ రాకుండా చూడటం లేదా ఆ క్రెడిట్‌లో భాగస్వామ్యం కావడం విజ్ఞత అనిపించుకుంటుంది. కానీ వైసీపీ వ్యూహకర్తలు జగన్ చేత చట్టాన్ని సవరించలేరా అనే వ్యాఖ్యలు చేయించడం ద్వారా తాము అభివృద్ధి నిరోధకులమనే సంకేతాలు పంపారు. పోతరాజు తనను తాను కొట్టుకున్నట్లుగా, కేవలం పంతం కోసమే రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నామనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలా ఈ మావిగన్ రాజకీయం సాగుతోందన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular