స్వర్ణాంధ్ర 2047 విజన్ అమలుకు గవర్నెన్స్ సామర్థ్యాలను మరింత పదును పెట్టే లక్ష్యంతో ఏపీకి చెందిన తొమ్మిది మంది మంత్రులు ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. ఆర్థిక వృద్ధి, డిజిటల్ పాలన, సంక్షోభ నిర్వహణ, ప్రజా విశ్వాసం వంటి కీలక అంశాలపై ఈ ట్రైనింగ్, భవిష్యత్ పరిపాలనకు కొత్త దిశను చూపనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
సింగపూర్‌లో 9 మంది మంత్రులకు ప్రత్యేక గవర్నెన్స్ ట్రైనింగ్
స్వర్ణాంధ్ర 2047 అమలుకు సామర్థ్యాల పదును
డిజిటల్ గవర్నమెంట్ నుంచి క్రైసిస్ మేనేజ్‌మెంట్ వరకు శిక్షణ
రాష్ట్రానికి తిరిగొచ్చాక లీడ్ ట్రైనర్లుగా మంత్రులు
పరిపాలనలో గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌పై ఏపీ ఫోకస్
స్టేట్ పొలిటికల్ బ్యూరో, పెన్ పవర్, అమరావతి, ఏప్రిల్ 14:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా సామర్థ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా కీలక అడుగు పడింది. ఈ నెల 21 నుంచి 27 వరకు తొమ్మిది మంది మంత్రులు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సేవల నాణ్యత పెంపు, డిజిటల్ గవర్నెన్స్, సంక్షోభ నిర్వహణ వంటి అంశాలపై ఈ శిక్షణ కేంద్రీకృతమై ఉంటుంది. ఈ బృందంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్&బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. వీరితో పాటు ప్లానింగ్ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా పర్యటనలో భాగం కానున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ప్రతిరోజూ ఒక ప్రత్యేక థీమ్‌పై శిక్షణ ఉంటుంది. మొదటి రోజు “నేషన్ ఫస్ట్”, రెండో రోజు ప్రజాప్రతినిధులు–శాఖల సమన్వయం, మూడో రోజు సంక్షోభ నిర్వహణ, నాలుగో రోజు డిజిటల్ గవర్నమెంట్, ఐదో రోజు ఆర్థిక వృద్ధి, ఆరో రోజు రాజకీయ బాధ్యత–ప్రజా విశ్వాసం, చివరి రోజు యాక్షన్ ప్లాన్‌పై చర్చలు జరగనున్నాయి. ఈ శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత, ఈ మంత్రులు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు లీడ్ ట్రైనర్లుగా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. కేవలం శాఖల నిర్వహణకే కాకుండా, గవర్నెన్స్‌లో గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను రాష్ట్ర స్థాయికి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్న స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా ఈ శిక్షణను కీలక మైలురాయిగా అధికారులు అభివర్ణిస్తున్నారు. ప్రపంచస్థాయి పరిపాలన పద్ధతులను నేర్చుకుని, వాటిని స్థానిక అవసరాలకు అనుగుణంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పనితీరులో స్పష్టమైన మార్పులు తీసుకురావాలన్నదే ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

