ePaper
Monday, April 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుచీడిగొంది గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం?

చీడిగొంది గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం?

📰 Generate e-Paper Clip

పది ఏళ్లుగా అంగన్వాడీ కోసం ఎదురుచూపులు

శిథిలావస్థలో పాఠశాల భవనం.. పిల్లల భద్రతపై ఆందోళన

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 16: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దేవరాపల్లి గ్రామపంచాయతీకి చెందిన చీడిగొంది గ్రామంలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. గ్రామ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు వినతులు అందజేసినా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం—చీడిగొంది గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేకపోవడం వల్ల చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలోని లక్కవరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి సుమారు 2.5 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. రోజువారీగా అంత దూరం ప్రయాణించడం చిన్నారులకు, బాలింతలకు కష్టసాధ్యమవుతోందని వాపోతున్నారు. దాదాపు 50 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో గత 10 ఏళ్లుగా అంగన్వాడీ కేంద్రం కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల గూడెం కొత్తవీధి మండలానికి మంజూరు చేసిన 57 కొత్త అంగన్వాడీ కేంద్రాల జాబితాలో తమ గ్రామం లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. ఈ నెల 13న పాడేరు ఐటిడిఏలో నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంతికి వినతిపత్రం సమర్పించి, చీడిగొంది గ్రామంలో మినీ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసి, టీచర్‌ను నియమించాలని కోరినట్లు గ్రామస్తుడు జి. పాపారావు తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉండటంతో పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పారు. పాఠశాలకు సంబంధించిన వంటగది నిర్మాణం సగం వరకు ఆగిపోయిందని, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాలేదని, కాంపౌండ్ గోడ లేకపోవడం, విద్యుత్, తాగునీటి సదుపాయాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పాఠశాలలో స్వీపర్ కూడా లేకపోవడం పరిస్థితిని మరింత దయనీయంగా మారుస్తోందన్నారు.ఈ సమస్యలన్నింటినీ ఇటీవల పాడేరు ఐటిడిఏ గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు, పాఠశాల భవనం నిర్మాణం సహా అన్ని సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular