గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 19:
మహిళల భద్రత పట్ల సమాజంలో అవగాహన పెంపొందించేందుకు గంగవరం పోలీసులు పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రతి ఒక్కరూ సత్సంకల్పంతో ప్రవర్తిస్తూ మహిళల రక్షణకు తోడ్పడాలని గంగవరం ఎస్సై ఎస్. వెంకయ్య సూచించారు.
ఆదివారం ఎస్సై వెంకయ్య ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ ఆదేశాల మేరకు అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి పర్యవేక్షణలో గంగవరం పోలీసులు ఈ ప్రచారాన్ని చేపట్టారు.
పట్టణంలోని ప్రధాన కూడళ్లలో, వ్యాపార కేంద్రాల్లో మహిళల భద్రతకు సంబంధించిన పోస్టర్లను అతికించి ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలపై అసాంఘిక చర్యలు, అసభ్య ప్రవర్తన, దుర్భాషలాడడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై వెంకయ్య హెచ్చరించారు.
ఈ పోస్టర్ల ద్వారా మహిళల రక్షణపై చైతన్యం పెంపొందించడంతో పాటు సమాజంలో బాధ్యతాయుత ప్రవర్తన అవసరాన్ని పోలీసులు గుర్తుచేశారు. గంగవరం కేంద్రంలోని పలు ప్రాంతాల్లో వాల్ పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

