తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ప్రజాప్రతినిధులు
వ్యక్తిగత జీవితం – ప్రజా జీవితం మధ్య సున్నితమైన రేఖ
అనుచరుల ప్రవర్తనతో పెరుగుతున్న రాజకీయ ఇబ్బందులు
టోల్ ప్లాజా ఘటనతో తెరపైకి వచ్చిన వివాదం
భవిష్యత్ టికెట్లపై కఠిన నిర్ణయాల సంకేతాలు
బ్యూరో రిపోర్ట్ | పెన్ పవర్ | విజయవాడ | ఏప్రిల్ 29

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై చర్చ మొదలైంది. ఒక ఇష్యూ ముగిసేలోపే మరో వివాదం తెరపైకి రావడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తరచూ వివాదాల్లో చిక్కుకోవడం రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తోంది. ప్రజా జీవితంలో ఉన్న నాయకుల ప్రతి చర్య, ప్రతి మాట ఇప్పుడు ప్రజల దృష్టిలోనే కాకుండా మీడియా, సోషల్ మీడియా కంట్రోల్‌లోనూ ఉంది. చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద చర్చకు దారితీస్తోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు నాయకుల రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న సంఘటనలు చూస్తే, నాయకుల వ్యక్తిగత జీవితం మరియు ప్రజా జీవితం మధ్య గల రేఖ ఎంత సున్నితమో స్పష్టమవుతోంది. వ్యక్తిగతంగా చేసిన చిన్న తప్పు కూడా పబ్లిక్ ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే సీనియర్ నాయకులు ఎప్పుడూ సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్ అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే, వారి ప్రవర్తన మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులు, సిబ్బంది చేసే పనులు కూడా అదే స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. చివరకు ఒక ఫోటోలో కనిపించిన వ్యక్తి చేసిన తప్పు కూడా ఆ నాయకుడి మెడకే చుట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేరు ఇటీవల చర్చకు వచ్చింది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరు ఉన్నప్పటికీ, టోల్ గేట్ వద్ద జరిగిన సంఘటన రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆయన అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన ఘటన తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించి, కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. తప్పు ఎవరిదన్నది పక్కన పెడితే, ఇలాంటి సంఘటనలు పార్టీకి ఇమేజ్ డ్యామేజ్ కలిగించే అంశాలుగా మారుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేసిన సీఎం, పబ్లిక్ లైఫ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్న ఇష్యూ అనుకుని వదిలేస్తే అది పెద్ద సమస్యగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు అనవసర వివాదాల్లోకి వెళ్లడం ఆగడం లేదు. ఇలా కొనసాగితే భవిష్యత్తులో టికెట్ల కేటాయింపులో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజల విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

