ePaper
Sunday, May 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్చెరువు రహదారి కబ్జా..!

చెరువు రహదారి కబ్జా..!

📰 Generate e-Paper Clip

అధికార పార్టీ అండతో దందా… గ్రామంలో ఉద్రిక్తత

పుల్లల చెరువు పెన్ పవర్ మే 2

పుల్లలచెరువు మండల కేంద్రంలో అక్రమణదారులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడే కూటమి నాయకులు పాగా వేస్తున్నారని, అధికార పార్టీ అండదండలతో కబ్జా దందా బహిరంగంగా నడుస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన నాయకులే అక్రమాలకు పాల్పడటం దారుణమని మండిపడుతున్నారు.స్థానికుల వాదన ప్రకారం, మండలంలో ఒక ప్రముఖ నాయకుడు ఫేక్ పట్టాలు సృష్టించడంలో నిష్ణాతుడిగా పేరుగాంచాడని,గతంలోనూ అనేక ఫేక్ పట్టాలు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు.అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లపై నకిలీ పత్రాలు సృష్టించి భూములు కాజేయడం అతనికి అలవాటైపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు.తాజాగా మండల కేంద్రంలోని కాటి వీరన్న చెరువుకు వెళ్లే ప్రధాన రహదారిపైనే కబ్జా ప్రయత్నం చేయడం కలకలం రేపింది. చెరువుకు వెళ్లే ఆ రహదారిని ఆక్రమించి డూప్లికేట్ పట్టా సృష్టించి, మూడో వ్యక్తికి విక్రయించేందుకు కొందరు నాయకులు పన్నాగం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారాన్ని అమలు చేయడానికి ఒక మధ్యవర్తిని రంగంలోకి దించి, అన్ని బాధ్యతలను అతనికే అప్పగించినట్లు తెలిసింది.మధ్యవర్తి బహిరంగంగానే మాకు ప్రభుత్వ అండదండలు మెండుగా ఉన్నాయి… మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు అంటూ దూకుడుగా వ్యవహరించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్లతో మట్టిని తరలించి రహదారిని మూసివేయడానికి ప్రయత్నించడంతో గ్రామస్తులు అడ్డుపడి తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇరువర్గాలను చెదరగొట్టి, సమస్యను తాత్కాలికంగా సద్దుమణిగించారు. అయితే స్థానికుల్లో మాత్రం ఆగ్రహం చల్లారలేదు.

ఇదిలా ఉండగా, చెరువు పోరంబోకు భూములకు రెవెన్యూ అధికారులు ఎలా పట్టాలు జారీ చేశారన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు కొందరు అధికారులతో కుమ్మక్కయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఉన్నతస్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.చెరువుల రహదారులే కబ్జా అయితే సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? ప్రభుత్వ భూములు కూడా రక్షణ లేకుండా పోతే ఎలా? అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular