సీజనల్ వ్యాధుల నివారణతో పాటు హెచ్‌పీవీ టీకాపై అవగాహన
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 24:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని కేజీబీవీ, ఏపీఆర్ బాలికల పాఠశాలల్లో నిర్వహించిన పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం) కార్యక్రమంలో ఆర్‌వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. రోజి వినీతాంజలి పాల్గొని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులకు ఆరోగ్య పరిరక్షణపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,విద్యార్థినులు అనారోగ్యానికి గురైనప్పుడు స్వయంగా మందులు వాడకుండా వెంటనే సమీప వైద్యులను సంప్రదించాలని సూచించారు. పసరు మందులు, చెక్క మందులు వంటి శాస్త్రీయ ఆధారాలు లేని చికిత్సలను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 11 నుంచి 18 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్‌పీవీ టీకా వేయించడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించవచ్చని వివరించి, తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ కుమార్తెలకు ఈ టీకా వేయించాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆమె,దోమతెరలను తప్పనిసరిగా వినియోగించాలని,కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఓ జాన్సన్, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

