పదో తరగతిలో 571 మార్కులతో ప్రతిభ చాటిన విద్యార్థినికి జేసీ చేతుల మీదుగా సత్కారం
చింతపల్లి,పెన్ పవర్,జూలై 20: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ఎస్.ఆర్. శంకరన్ ఆడిటోరియంలో సోమవారం ఘనంగా నిర్వహించిన ‘షైనింగ్ స్టార్స్-2026’ కార్యక్రమంలో చింతపల్లి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ప్రతిభావంతురాలు గంపల భవిష్య కాత్వికి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం, నగదు ప్రోత్సాహక చెక్కును అందజేశారు.2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన భవిష్య కాత్వి మొత్తం 571 మార్కులు సాధించి తన పాఠశాలలో ప్రథమ స్థానం దక్కించుకుంది. చింతపల్లిలోని సెంటెన్స్ పాఠశాలలో విద్యనభ్యసించిన ఆమె అన్ని సబ్జెక్టుల్లోనూ 90కి పైగా మార్కులు సాధించడం విశేషం. ముఖ్యంగా గణితంలో 100కు 100 మార్కులు సాధించి తన అసాధారణ ప్రతిభను చాటుకుంది.కృష్ణాపురం గ్రామానికి చెందిన గంపల చెల్లారావు కుమార్తె అయిన భవిష్య కాత్వి ఈ విజయంతో గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆమెను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

