డిపాజిట్లు తీసుకుని పాట రద్దు చేయడం అన్యాయం
డిపాజిట్‌దారుల ఆవేదన
కాకినాడ, పెన్ పవర్, జూలై 13:
కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామ సీపీడబ్ల్యూఎస్ చెరువులో సహజసిద్ధంగా పెరిగిన చేపల బహిరంగ వేలాన్ని హఠాత్తుగా నిలిపివేయడంపై జిల్లా కలెక్టర్‌కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వీరవల్లి గణపతి సోమవారం ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. గొల్లపాలెం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చెరువులోని చేపల వేట హక్కులను బహిరంగ వేలం ద్వారా కేటాయించేందుకు గ్రామంలో చాటింపు వేయడంతో పాటు అధికారిక ప్రకటన విడుదల చేశారు. వేలంలో పాల్గొనదలచిన వారు సాల్వెన్సీ సర్టిఫికెట్‌తో పాటు రూ.9 వేల డిపాజిట్ చెల్లించాలని నిబంధనలు విధించారు.
దీనికి అనుగుణంగా జూలై 10న మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో, ఆర్వో శ్రీనివాసరావు సమక్షంలో వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసి, ఎనిమిది మంది నుంచి డిపాజిట్లు కూడా స్వీకరించారు. అయితే వేలం ప్రారంభించే సమయంలోనే “కొత్త జీవో అమల్లోకి వచ్చింది” అంటూ అధికారులు వేలాన్ని ఆకస్మికంగా నిలిపివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.సదరు జీవో ముందుగానే అమల్లో ఉంటే వేలానికి సంబంధించి అధికారిక నోటీసు ఎందుకు జారీ చేశారని, డిపాజిట్లు ఎందుకు స్వీకరించారని గణపతి ప్రశ్నించారు. అనంతరం ఆ జీవో స్థానిక మత్స్యకారులకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.చెరువు చేపల వేట వేలాన్ని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాయిదా వేయడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే డిపాజిట్లు చెల్లించిన వారికి న్యాయం జరిగేలా త్వరితగతిన బహిరంగ వేలం నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను డిపాజిట్‌దారులు కోరారు.

