భక్తుల సౌకర్యమే లక్ష్యం… గిరి ప్రదక్షిణకు పటిష్ట ఏర్పాట్లు

5–6 లక్షల మంది భక్తుల రాక అంచనా… 5 వేల మంది సిబ్బందితో సేవలు
ట్రాఫిక్, భద్రత, వైద్యం, తాగునీటి ఏర్పాట్లపై హోంమంత్రి అనిత వెల్లడి
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 25 : సింహాచలం గిరి ప్రదక్షిణకు హాజరయ్యే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆమె, ఈసారి 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
32 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణలో భక్తుల సేవల కోసం వివిధ శాఖలకు చెందిన సుమారు 5 వేల మంది సిబ్బందిని విధుల్లోకి దింపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. తొలిపావంచా వద్ద రద్దీని నియంత్రించేందుకు 50 క్యూ లైన్లు, 120 ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28న ఉదయం నుంచే గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి రథోత్సవం ప్రారంభమవుతుందని చెప్పారు.
భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణ మార్గంలో 28 సహాయ కేంద్రాలు, ఏడు ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లైటింగ్, సూచిక బోర్డులు, వైద్య సేవలు, కార్పెట్లు తదితర సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. పోలీస్, దేవస్థానం, జీవీఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ 31 వైద్య శిబిరాలు, 22 అంబులెన్సులు, ప్రత్యేక మొబైల్ వైద్య బృందాలను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలో 115 తాగునీటి కేంద్రాలు, వాటర్ బబుల్స్, నీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలు పనిచేయనున్నాయని, 595 తాత్కాలిక మరుగుదొడ్లతో పాటు శాశ్వత మరుగుదొడ్లను కూడా వినియోగంలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
భద్రతా చర్యల్లో భాగంగా దిగువ, ఎగువ కొండ ప్రాంతాల్లో మొత్తం 115 తాత్కాలిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. పోలీస్ శాఖకు చెందిన 2,700 మంది సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొననున్నారని, పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు.
గిరి ప్రదక్షిణ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. హనుమంతవాక, వేపగుంట, గోపాలపట్నం, శొంఠ్యాం ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించనున్నట్లు వెల్లడించారు.
అప్పుఘర్, జోడుగుళ్లపాలెం సముద్ర తీరాల్లో భక్తుల భద్రత కోసం మూడు షిఫ్టుల్లో 90 మంది నిపుణులైన ఈతగాళ్లను మోహరిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడపడంతో పాటు, జూలై 29న కొండపై నుంచి దిగువకు భక్తులను తరలించేందుకు దేవస్థానం బస్సులతో పాటు 50 ఆర్టీసీ బస్సులను ఉచితంగా నడపనున్నట్లు చెప్పారు.
గిరి ప్రదక్షిణ విజయవంతానికి భక్తుల సహకారం ఎంతో అవసరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. అధికారులు, పోలీసులు సూచించే ట్రాఫిక్, భద్రతా నిబంధనలు పాటించాలని, సముద్ర స్నానాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నారులు, వృద్ధుల విషయంలో కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా, గిరి ప్రదక్షిణ ప్రభావం ఉండే గోపాలపట్నం, చినగదిలి, సీతమ్మధార, పెందుర్తి మండలాల పరిధిలోని 221 పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 28న స్థానిక సెలవు ప్రకటించినట్లు హోంమంత్రి వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.

